ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరపాలి

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరపాలి
 
హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని కేవలం ఒక ప్రమాదంగా చూసి వదిలేయలేం అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని కుదిపేసిన పలు కీలక కేసులకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, డీఎన్‌ఏ రిపోర్టులు, వాయిస్ సాంపిల్స్, డిజిటల్ ఎవిడెన్స్.. ఇవన్నీ అక్కడే ఉండటం ఇప్పుడు అనేక సందేహాలకు తావిస్తోందని చెప్పారు. 

అనేక కేసులకు సంబంధించి ఆధారాలు, వివరాలు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఉన్న చోటే అగ్నిప్రమాదం జరగడం, ఫైళ్లు కాలిపోవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు.  అందుకే ఈ అగ్నిప్రమాదం కేసుపై తప్పనిసరిగా స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరగాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు.  ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం జరిగి అనేక కీలక ఫైళ్లు తగలబడ్డాయని రావు గుర్తు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో  రెండేళ్లు దాటుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో ఈ వ్యవహారాన్ని సాగదీస్తోంది తప్ప, అసలు దోషులను ఇప్పటివరకు పట్టుకోలేదని రామచందర్ రావు విమర్శించారు. దీనివల్ల తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.  ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కదారి పట్టించడానికే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం కుట్ర పూరితంగా జరిగిందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు.

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది బిజెపి నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా, పార్టీ రాష్ట్ర నాయకులపై, జాతీయ నాయకులపై కూడా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం జరిగిందని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో కాంగ్రెస్ పార్టీకి నష్టమేమీ లేదన్న భావనతోనే, ఈ అగ్నిప్రమాదాన్ని కుట్రగా నిర్వహించారనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

 
బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీలు ఒకరికొకరు సహకారం అందించుకుంటూ, తమ వైఫల్యాలు, అవినీతి, అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు బిజెపిపై అనవసర విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆనాడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ రక్షించిందని, అదే కారణంగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు.
 
కాగా, తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వాతావరణం అనుకూలంగా ఉందని చెబుతూ ఈ ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయం అని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.