గత 12 ఏళ్లుగా తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్-కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేకుండా అప్పులే మిగిలాయని బిజెపిరాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ధ్వజమెత్తారు. అంతకు ముందు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనల ఫలితంగా తెలంగాణ పట్టణ ప్రాంతాలు తీవ్రమైన ఆర్థిక, పరిపాలనా పతనానికి గురయ్యాయని ఆయన తెలిపారు.
బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన “12 ఏళ్ల పాటు తెలంగాణ పట్టణాలలో అధోగతి (బిఆర్ఎస్, కాంగ్రెస్ వారసత్వం)” అనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణ ప్రాంతాల్లో నిజమైన అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధించాలంటే, అలాగే తెలంగాణ భవిష్యత్తు కోసం మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలన దోపిడీ, అవినీతిలాకు కేరాఫ్‌గా మారిందని, బిజెపి మాత్రమే అభివృద్ధి, నిజాయితీ గల పాలన అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందుకే నగరాలను కాపాడుకోవాలంటే, ప్రజల భవిష్యత్తును రక్షించుకోవాలంటే, మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుకే ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సేవ్ తెలంగాణ – ఓట్ ఫర్ బిజెపి అని పిలుపునిచ్చారు.
తెలంగాణలోని 123 మున్సిపాలిటీలపై మొత్తం రూ.3,600 కోట్ల అప్పులు పేరుకుపోయాయని, అలాగే జీహెచ్ఎంసి అప్పు మాత్రమే రూ.5,000 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. అభివృద్ధి కనిపించకపోయినా, అప్పుల భారం మాత్రం మున్సిపల్ సంస్థలపై తీవ్రంగా మోపారని విరుచుకుపడ్డారు. అభివృద్ధి పేరుతో కాకుండా కమిషన్లు, అవినీతి, దోపిడీ, కరప్షన్ ద్వారానే పట్టణ స్థానిక సంస్థలు నడిచాయని ఆరోపించారు. ఫలితంగా పట్టణ పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తమై, స్థానిక సంస్థలు చీకటిలోకి నెట్టబడ్డాయని తెలిపారు.
అవినీతిని అరికట్టాల్సిన వ్యవస్థలే పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొంటూ కాంగ్రెస్ పాలనలో ఎసిబి ద్వారా 1500 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడినప్పటికీ, వారిపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అవినీతి మరింత పెరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత “మార్పు” పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
గత పాలనల ఆర్థిక వైఫల్యాలను సరిదిద్దడం పక్కనపెట్టి, కేవలం ఒకే ఏడాది కాలంలోనే రూ.80,000 కోట్ల మేర కొత్త అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో నేరాలు పెరగడం, నిరుద్యోగం అధికమవడం, మౌలిక వసతులు క్షీణించటం స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత పూర్తిగా కరువైందని, శాంతిభద్రతలు క్షీణించాయని రాంచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేక సుమారు 40 మంది వరకు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు, నేత కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్ల కొరత, నిరుద్యోగం, పెరిగిందని వెల్లడించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి ఎంపీలు, ఎమ్మెల్సీలు, మహారాష్ట్ర మంత్రి, బిజెపి మున్సిపల్ ఎన్నికల తెలంగాణ ఇన్‌ఛార్జ్ శ్రీ ఆశిష్ షెలార్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
కలలు కనకపోవడం నేరం .. సాకారంకు కార్యాచరణ అవసరం
కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఆర్బీఐ నిర్ణయం
అజిత్ దోవల్,మార్కో రూబియో భేటీ జరగనే లేదు