సాగుకు ‘ఏఐ’ సాయం- రైతుల కోసం ‘భారత్ విస్తార్’

సాగుకు ‘ఏఐ’ సాయం- రైతుల కోసం ‘భారత్ విస్తార్’

‘భారత్ విస్తార్’ పేరుతో ఏఐ బహుభాషా టూల్‌ను తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘భారత్ విస్తార్’ టూల్‌తో కేంద్ర ప్రభుత్వ అగ్రి స్టాక్ వెబ్‌సైట్లను, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) వ్యవసాయ మార్గదర్శకాలను, అధునాతన ఏఐ సిస్టమ్‌లను అనుసంధానిస్తారు.  దేశ రైతుల వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ‘భారత్ విస్తార్’లోని ఏఐ సమాచారం దోహదపడుతుందని నిర్మల తెలిపారు.

పంటసాగు చేపట్టే క్రమంలో ముప్పును తగ్గించే విలువైన సలహాలను ఇది అందిస్తుందని చెప్పారు. తద్వారా దేశంలోని కోట్లాది మంది రైతులను ఏఐతో ఏకీకృతం చేయాలనే భారత సర్కారు విజన్ కూడా సాకారం అవుతుందని తెలిపారు.  రైతులు తమతమ ప్రాంతీయ భాషల్లోనే ఈ టూల్ ద్వారా వ్యవసాయ సూచనలను పొందొచ్చని ఆర్థిక మంత్రి చెప్పారు. పంటసాగు మెళకువలు, పంట ఉత్పాదకతను పెంచే సిఫారసులు, వాతావరణ సూచనలు, పంటల తాజా మార్కెట్ ధరలు వంటి సమాచారం మొత్తం ‘భారత్ విస్తార్’ టూల్‌లో ఉంటుందన్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉన్న 46.1 శాతం మంది రైతులకు ఈ ఏఐ టూల్ ఉపయోగపడుతుందని ఆమె వివరించారు.

పశుపోషణ, ఫిషరీస్, డైరీ, పౌల్ట్రీ రంగాలకు వరాలు

• ఈసారి కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1,27,290 కోట్లు కేటాయించారు.
• రూ.10,466.39 కోట్లను వ్యవసాయ పరిశోధన, విద్యకు కేటాయించారు.
• ఫిషరీస్ (మత్య్సకార) రంగం కోసం 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్‌ల సమీకృత అభివృద్ధి. దేశంలోని సముద్ర తీర ప్రాంతాల మత్య్సకారులకు చేయూత. స్టార్టప్‌లు, మహిళా సంఘాలు, రైతుల ద్వారా మత్య్సకారులకు మార్కెట్ లింకేజీ ఏర్పాట్లు.
• పశుపోషణ, డైరీ, పౌల్ట్రీ రంగాల్లోని పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆధునికీకరణ కోసం ‘క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం’ అమలు. సప్లై చైన్ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు డైరీ, పౌల్ట్రీ పరిశ్రమలకు చేయూత. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ఏర్పాట్లు.
• పలు రాష్ట్రాల్లో కొబ్బరి, చందనం (శాండల్ వుడ్), జీడిపప్పు, కొకోవా, అగార్ చెట్లు, బాదం, వాల్ నట్స్, పైన్ నట్స్ లాంటి పంటలను సాగు చేసే దిశగా రైతులకు ప్రోత్సాహం.
• జీడిపప్పు, కొకోవా ప్రాసెసింగ్‌లో భారత పరిశ్రమలు స్వయం సమృద్ధిని సాధించేలా ప్రోత్సాహం. ఈ విభాగంలో 2030 నాటికి భారతీయ బ్రాండ్ల ఆవిర్భావానికి చేయూత.

వ్యవసాయ రంగం వల్లే 7 శాతం ఆర్థిక వృద్ధి రేటు
“భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతానికి పెరిగిందంటే అందుకు ప్రధాన కారణం వ్యవసాయ రంగమే. మేం వ్యవసాయ రంగ వికాసానికి గతంలోనూ చాలా చర్యలను చేపట్టాం. అవి మంచి ఫలితాలను ఇచ్చాయి. లక్షలాది మంది చిన్న, సన్నకారులు జీవితాల్లో ఎదిగారు. విత్తనాలు, ఎరువులతో ముడిపడిన సప్లైలో రైతులు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు” అని ఆర్ధిక మంత్రి తెలిపారు.

“అయినప్పటికీ సాగునీరు, విద్యుత్, ఎరువులను సమర్ధంగా వినియోగించుకొని భారత రైతులు పంటల ఉత్పాదకతను పెంచుతున్నారు. దేశంలో దాదాపు కోటి మంది రైతులు, 3 కోట్ల మంది చిరువ్యాపారుల జీవితాలు కొబ్బరిసాగుపై ఆధారపడి ఉన్నాయి. కొబ్బరి ఉత్పత్తిలో ప్రపంచ నంబర్ 1 స్థానంలో భారత్ ఉంది. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడంతో పాటు చిన్న,సన్నకారు రైతులను పైకి తీసుకురావడమే వికసిత భారత్ మిషన్ లక్ష్యం” అని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు.