ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ ప్రవేశపెట్టారనీ, పౌరుల జీవన శైలిని మార్చేందుకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింత దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్టు సహకరించేలా ఉందని చెప్పారు.
రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్‌ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించిందనీ, వీటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. మహిళలు, రైతులు, యువత సాధికారిత సాధించేలా బడ్జెట్ ఉందని, 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఏఐ సహా వివిధ టెక్నాలజీలు, నెక్స్ట్ లెవల్ ఆఫ్ రిఫార్మ్స్ కు వెళుతుందని, రెన్యువబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ నేషన్ దిశగా బడ్జెట్ ఉందన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించారని చంద్రబాబు చెప్పారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా బడ్జెట్ ఉందని, టెక్స్ టైల్ సెక్టార్‌కు కూడా ఊతమిచ్చారని చెబుతూమన రాష్ట్రానికి ఈ అంశం చాలా ఉపకరిస్తుందని తెలిపారు.
పర్యాటకానికి, హాస్పిటాలిటికి కూడా ప్రాధాన్యం ఇచ్చారని చెబుతూ అరకులో టూరిజం పెరగడానికి దోహదం చేస్తుందని, కోకోనట్, జీడి, కోకో, చందనం లాంటి పంటలకు ఊతమిచ్చేలా చర్యలు ఉన్నాయని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ పెట్టడంతో భారత్ డేటా సెంటర్ల హబ్‌గా తయారవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయని గుర్తు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయని, పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెలిపారు. లాజిస్టిక్స్ రంగానికి ఏపీ పూర్తి స్థాయిలో దఅష్టి సారించిందని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర బడ్జెట్టులో తొలిసారిగా లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి గురించి ప్రస్తావించారని తెలిపారు.
టెక్నాలజీ సాయంతో మనదేశంలో అనేక మార్పులు వస్తున్నాయని, మనదేశం ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటోందని ఆయన చెప్పారు. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల కొత్తగా 3 హై స్పీడ్ రైల్ కారిడార్‌లు వస్తున్నాయనీ, అందులో హైదరాబాద్-బెంగుళూరు.. అనంతపురం, కర్నూలు కవర్ అవుతుందని చెప్పారు. హైదరాబాద్-చెన్నై కారిడార్ అమరావతి, తిరుపతి మీదుగా చెన్నై వెళుతుందని, బెంగుళూరు -చెన్నై పలమనేరు, చిత్తూరు మీదుగా రాబోయే రోజుల్లో తిరుపతికి కనెక్ట్ చేసే విధంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ మూడు కారిడార్లు ఏపీని కవర్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పా రు. హైస్పీడ్ రైళ్లు వస్తే.. అమరావతి, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఈ నాలుగు సిటీలు 5 కోట్ల జనాభా, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా డైనిమిక్ జోన్‌గా తయారవుతుందని స్పష్టం చేశారు. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ లో ఆంధ్రప్రదేశ్‌ను కూడా చేర్చారని చెప్పారు.
అరుదైన ఖనిజాల వెలికితీతవల్ల ఏపీకి ఎంతో లాభం అని పేర్కొంటూ బీచ్ శాండ్‌తో పాటు మన రాష్ట్రంలో వివిధ రకాల మినరల్స్ ఉన్నాయని తెలిపారు. డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ, సోలార్ ప్యానల్స్, క్రిటికల్ ఎలక్ట్రానిక్స్‌కి వీటిని ఉపయోగించుకునే పరిస్థితి వస్తుందని, ఇది ఒక పెద్ద శుభపరిణామం అని చెప్పారు. ఐఎస్‌ఎం 2.0.. సెమీ కండకర్టర్ రంగానికి దోహదం చేస్తుందని, ఇది టెక్నాలజీకి పెద్దపేట వేయడమేనని సిఎం చంద్రబాబు తెలిపారు.

More Stories
భారత సైనిక చరిత్రలో ఓ ప్రభంజనం ఫీల్డ్ మార్షల్ మానెక్షా
ప్రపంచంలో ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతాం
హోర్ముజ్‌ను తిరిగి తెరవాలని 60 దేశాల పిలుపు