ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి నూతన ఆదాయ పన్ను చట్టం

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి నూతన ఆదాయ పన్ను చట్టం

నూతన ఆదాయపన్ను చట్టం -2025 ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సామాన్యులు కూడా సులభంగా అర్థం చేసుకునేలా ఫారమ్​లను సరళతరం చేసామని చెప్పారు. ఎన్​ఆర్​ఎస్​ కింద టీసీఎస్​ రేటు 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని నిర్ణయించామని తెలిపారు. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్‌ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.

ఈసారి పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయనప్పటికీ, దశాబ్దాల కాలం నాటి పాత చట్టానికి స్వస్తి పలుకుతూ కొత్త అధ్యాయానికి తెరలేపారు. 60 ఏళ్ల నాటి 1961 ఆదాయ పన్ను చట్టం స్థానంలో, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి తెస్తామని చెప్పారు. సంక్లిష్టంగా ఉన్న సెక్షన్లను 819 నుంచి 536కి తగ్గించి, సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా దీనిని రూపొందించామని చెప్పారు.

గతేడాది ప్రకటించిన విధంగానే పన్ను శ్లాబులను ఉంచారు. అయితే సెక్షన్ 87ఏ కింద లభించే పన్ను రిబేట్ వల్ల రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను పడదు. దీనికి అదనంగా రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే, రూ.12.75 లక్షల వరకు ఆదాయం ఉన్న శాలరీడ్ ఎంప్లాయిస్‌కు సున్నా పన్ను వర్తిస్తుంది.

ఐటీఆర్ గడువు పెంపు
పన్ను రిటర్నుల్లో తప్పులను సరిదిద్దుకోవడానికి రివైజ్డ్ రిటర్న్స్ ఇచ్చే గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు. ఐటీఆర్ ఫైలింగ్ రద్దీని తగ్గించేందుకు కొత్త గడువులను ప్రతిపాదించారు. ITR-1, ITR-2 దాఖలు చేసే వారికి జూలై 31 వరకు, ఆడిట్ అవసరం లేని వ్యాపారాలకు ఆగస్టు 31 వరకు సమయం ఇచ్చారు.

పెట్టుబడిదారులకు కాస్త ఊరట

  • ఎస్ టి టి పెంపు: స్టాక్ మార్కెట్ ట్రేడర్లపై భారం పడేలా ఫ్యూచర్స్​పై ఎస్టీటీని 0.02% నుంచి 0.05%, ఆప్షన్స్ పై 0.15%కి పెంచారు.
  • టిసిఎస్ తగ్గింపు: విదేశీ విద్య, వైద్యం కోసం పంపే నిధులపై టీసీఎస్ ను 5% నుంచి 2%కి తగ్గించారు.
  • ఒకే ఐటీఆర్ ఫామ్: పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు ‘వన్ నేషన్ – వన్ ఐటీఆర్ ఫామ్’ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.

పన్ను మినహాయింపులు
రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగించినట్లు పేర్కొన్నారు. పన్ను పరిధిలోకి మానవ వనరుల సరఫరా ఏజెన్సీలను తెస్తామన్నారు. వీటిపై 1 లేదా 2 శాతం టీడీఎస్​ మాత్రమే విధిస్తామని చెప్పారు. స్మాల్​ ట్యాక్స్ పేయర్స్ కోసం ప్రత్యేక పథకం తెస్తామన్నారు.

విదేశీ విద్య, వైద్య పర్యటనలకు కూడా టీసీఎస్​ను 5 శాతం నుంచి 2 శాతానికి​ తగ్గిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇకపై విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించడం తప్పనిసరి అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే వ్యక్తిగత ఆదాయ పన్నును మాత్రం ఆమె యథాతథంగా ఉంచారు.

ట్యాక్స్ హాలీడే
భారత్​లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. 2047 వరకు డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. దీని వల్ల క్లౌడ్ సేవలు అందించే సంస్థలకు భారీగా ప్రయోజనం చేకూరనుంది.

కార్పొరేట్​​ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను
నిర్మలా సీతారామన్ కార్పొరేట్​​ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. నాన్ కార్పొరేట్ బైబ్యాక్​ కొనుగోళ్లపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న మదుపరుల ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

పన్ను వివాదాలు
పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పన్ను వివాదాల్లో జైలు శిక్ష రెండేళ్లకు తగ్గించామని, జరిమానా చెల్లిస్తే ఆ రెండేళ్ల జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు.

ఐటీ సేవలు
ఒకే గొడుగు కిందకు అన్ని ఐటీ సేవలు తెస్తామన్నారు. అణువిద్యుత్ కేంద్రాలకు సంబంధించిన పరికరాల దిగుమతులపై 2035 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నామని చెప్పారు.

దిగుమతులపై పన్నులు తగ్గింపు
సాధారణ ప్రజలకు ఊరట కల్పించేలా నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. వ్యక్తిగత వస్తువుల దిగుమతులపై సుంకాలను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.

క్యాన్సర్ ఔషధాలపై పన్ను మినహాయింపు
మైక్రోవేవ్​, సోలార్ ప్యానళ్లు, క్యాన్సర్ ఔషధాలపై పన్నులు తగ్గిస్తున్నామన్నారు. సెంట్రల్​ ఎక్సైజ్​ నుంచి బయో గ్యాస్​ ద్వారా ఉత్పత్తి అయ్యే సీఎన్​జీకి మినహాయింపు ఇస్తామన్నారు. మైక్రో అవెన్స్​పై, పౌర విమానాల విడిభాగాలపై పన్ను తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు.