అవినీతి నిరోధక చట్టంలోని 17ఎ నిబంధన చట్టబద్ధతపై సుప్రీంకోర్టు మంగళవారం భిన్నంగా స్పందించింది. ప్రభుత్వ అధికారులపై విచారణకు ముందస్తు అనుమతి తప్పనిసరి కాదా అనే అంశంపై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17ఎను జస్టిస్ బి.వి. నాగరత్న చట్టవిరుద్ధమని తేల్చగా, లోక్పాల్ లేదా లోకాయుక్త వంటి స్వతంత్ర సంస్థల ద్వారా అనుమతిని నిర్ణయించాలని డివిజన్ బెంచ్ మరో న్యాయమూర్తి పేర్కొన్నారు.
2018లో చట్ట సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఈ నిబంధన, నిజాయితీపరులను రక్షించడానికి బదులుగా అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. వాస్తవానికి నిజాయితీపరులైన అధికారులకు సెక్షన్ 17ఎ కింద ముందస్తు అనుమతి ద్వారా ఎటువంటి రక్షణ అవసరం లేదని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు.
అయితే ఈ నిబంధనను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, కొట్టివేయడమంటే, శిశువును స్నానపు నీటి తొట్టితో పాటు బయటకు విసిరేసినట్లే అవుతుందని జస్టిస్ విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. 2018 జులైలో ప్రవేశపెట్టబడిన అవినీతి నిరోధక చట్టం,1988లోని సెక్షన్ 17ఎ, సమర్థ అధికారి నుండి ముందస్తు అనుమతి లేకుండా అధికారికి విధుల నిర్వహణలో చేసిన సిఫారసుల కోసం ప్రభుత్వ ఉద్యోగిపై ఏదైనా ”విచారణ లేదా పరిశీలన లేదా దర్యాప్తు”ను నిషేధిస్తుంది.
ఈ సెక్షన్ను సవాలు చేస్తూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ అనే ఎన్జిఒ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఎవరైతే ‘సమర్థవంతమైన అధికారి’ ఉన్నారో వారికి ప్రభుత్వం నుండి అనుమతి రాకపోతే ఈ నిబంధనలు అవినీతి నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసినట్లేనని ప్రశాంత్ భూషణ్ వాదించారు.
ఆ సెక్షన్ ప్రభుత్వాన్ని జడ్జిగా మారుస్తుందని అన్నారు. సిబిఐకి సంబంధించిన కేసుల్లో సుమారు 40శాతం మాత్రమే సెక్షన్ 17ఎ కింద దర్యాప్తు కోసం ముందస్తు అనుమతి పొందాయని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. ”దేశానికి తమ ప్రాణాలను అర్పించే అధికారులు ఉన్నారు. వారి అధికారిక చర్యలు లేదా విధి నిర్వహణలో చేసిన సిఫారసుల కోసం ఆ అధికారులు నిష్ప్రయోజనమైన విచారణకు బలైపోకుండా ఏవిధంగా రక్షించుకోవాలి” అని గతేడాది ఆగస్టులో కేసు విచారణ చివరి రోజున జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు.
సెక్షన్ 17ఎ కవచం వంటిదని, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగిపై ద్వేషం ఉన్న ఎవరైనా ఒక ఎన్జిఒ ద్వారా ఆ అధికారిపై కేసులు నమోదు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరియు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి పేర్కొన్నారు.

More Stories
టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్
గల్ఫ్ దేశాల్లో భారతీయులు తీసుకొచ్చేందుకు కేంద్రం యత్నం
ఖమేనీ మృతికి వ్యతిరేకంగా కశ్మీర్లో నిరసనలు