హర్యానాలో ఆదివారం ఉదయం జరిగిన ఓ భారీ ఎన్‌కౌంటర్ లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు కీలక సభ్యులు హతమయ్యారు. మరణించిన ఆ ఇద్దరిపై హర్యానా పోలీసులు తలా లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు. బహదూర్‌గఢ్ లో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్, హర్యానా ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్)’ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ ఒకరికి గాయాలయ్యాయి.
ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారి ప్రమోద్ కుష్వా ప్రకారం నిందితులను హిసార్‌కు చెందిన ప్రవేశ్, జఖోద్ ఖేరా గ్రామానికి చెందిన హిమాన్షుగా గుర్తించినట్టు తెలిపారు. వీరు లారెన్స్ బిష్ణోయ్-హరిరామ్ అలియాస్ హ్యారీ బాక్సర్-అనిల్ పండిట్ క్రైమ్ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని, పలు కేసుల్లో పరారీలో ఉన్నారని చెప్పారు. జూన్ 11న హన్సీలో కపిల్ అనే జిమ్ ఆపరేటర్‌ను పట్టపగలే దారుణంగా హత్య చేసిన కేసులో వీరు ప్రధాన నిందితులుగా ఉన్నారు.
ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. మరో తీవ్రమైన నేరానికి పాల్పడేందుకు నిందితులు ఆయుధాలతో బహదూర్‌గఢ్ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్, హర్యానా ఎస్టీఎఫ్ బృందాలు సంయుక్తంగా వారిని ట్రాక్ చేసి చుట్టుముట్టాయి. లొంగిపోవాలని కోరగా నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారని హర్యానా ఎస్టీఎఫ్ ఎస్పీ విక్రాంత్ భూషణ్ తెలిపారు.
ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందన్ని తెలిపేరు. ఈ కాల్పుల్లో ఇద్దరు నిందితులతోపాటు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌కు చెందిన కానిస్టేబుల్ అంకిత్ కాలికి బుల్లెట్ గాయమైంది. గాయపడిన ముగ్గురినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నిందితులిద్దరూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
కానిస్టేబుల్ అంకిత్ చికిత్స పొందుతున్నారని, అతనికి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై బహదూర్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు నమోదు చేసి, చట్టపరమైన విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

More Stories
జమ్మూకశ్మీర్ లోయలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
యూఏపీఏ చట్టం పరిధిలోకి 23 మంది పాక్ ఉగ్రవాదులు
ఇస్రోను పేల్చేస్తామంటూ ఈమెయిల్