శ్రీశైలంలో ఇకపై చెంచులకు ఉచిత సర్వదర్శనం

శ్రీశైలంలో ఇకపై చెంచులకు ఉచిత సర్వదర్శనం
 
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలం దేవస్థాన పాలక మండలి శ్రీశైలం సమీప గూడెంలో నివసించే చెంచులకు ఉచితంగా స్వామివారి సర్వదర్శన భాగ్యాన్ని కల్పించింది. డిసెంబర్ 30వ తేదీ మంగళశారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఆలయ అధికారులు. ఇకపై ప్రతినెలలో ఒకరోజు చెంచులకు ఉచిత సర్వదర్శనం కొనసాగిస్తామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. 

మంగళకరమైన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం చెంచుగిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌ నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావ, సంబంధిత అధికారులు వారికి ఆహ్వానం పలికారు. తర్వాత చెంచులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేశారు.

అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి వారికి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, అమ్మవారి దర్శనాలను చేయించారు. అన్నప్రసాదవితరణ భవనములో చెంచు భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు. ధర్మకర్తలమండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి కూడా చెంచు భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

స్థానిక మేకలబండ గిరిజనులతో పాటు పలు ఇతర గూడెములకు చెందిన చెంచులు కూడా ఈ రోజు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌ నాయుడు మాట్లాడుతూ తాను పదవీబాధ్యతలను స్వీకరించిన వెంటనే స్థానిక మేకలబండ చెంచుగూడేలను సందర్శించానని తెలిపారు.  అప్పుడు చెంచులు తమకు స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించాలని కోరారని చెప్పారు. వారి అభ్యర్థన మేరకు చెంచులకు నెలలో ఒకరోజు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించామని ఆయన తెలిపారు. 

‘ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో చెంచుకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది’ అని రమేష్‌ నాయుడు పేర్కొన్నారు. శ్రీ భ్రమరాంబాదేవివారిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిడిగా చెంచులు భావిస్తారని కార్యనిర్వహణాధికారి  శ్రీనివాసరావు తెలిపారు.