కుటుంబ వ్యాపారంలా భారత్ రాజకీయాలు

కుటుంబ వ్యాపారంలా భారత్ రాజకీయాలు

కుటుంబ వ్యాపారంలా భారత్ రాజకీయాలు మారిపోయాని, ఇవి ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించాయని  భారతలో ఉన్న వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ హెచ్చరించారు. ప్రస్తుతం భారత్ పారదర్శకత, ప్రతిభ ఆధారిత నాయకత్వం వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఇండియన్ పాలిటిక్స్ ఆర్ ఏ ఫ్యామిలీ బిజినెస్ అనే వ్యాసంలో రాజకీయ పార్టీలను విమర్శించారు.

“దశాబ్దాలుగా ఒకే కుటుంబం దేశ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించింది. స్వాతంత్ర్య పోరాట చరిత్రతో నెహ్రూ- గాంధీ వంశం ముండిపడి ఉంది. ఇదే సమయంలో రాజకీయ నాయకత్వం పుట్టుకతో వచ్చే హక్కుగా భావించే దారుణ ఆలోచనకు బాట వేసింది. ఇవి కేవలం కాంగ్రెస్‌కే పరిమితం కాకుండా, వంశపారంపర్య రాజకీయాలు ఇతర పార్టీల్లో కూడా పాతుకుపోయాయి” అని శశి థరూర్ విమర్శించారు. 

బిజూపట్నాయక్‌- నవీన్‌ పట్నాయక్‌, బాల్‌ ఠాక్రే- ఉద్ధవ్‌ ఠాక్రే- ఆదిత్య ఠాక్రే, ములాయం సింగ్‌ యాదవ్‌- అఖిలేశ్‌ యాదవ్‌, షేక్‌ అబ్దుల్లా- ఒమర్‌ అబ్దుల్లా, కరుణానిధి- ఎంకే స్టాలిన్‌- ఉదయనిధి వంటి ఉదాహారణలు ఆయన ప్రస్తావించారు.కుటుంబమనేది ఒక బ్రాండ్‌గా ఉపయోగపడటం ఈ తరహా రాజకీయాలకు ఓ కారణం కావొచ్చని శశిథరూర్‌ పేర్కొన్నారు. 

ఇంట్లో ఒకరికి గుర్తింపు లభిస్తే, తదుపరి తరం అభ్యర్థులకు ఓటర్లను ఆకట్టుకునేందుకు, విశ్వాసాన్ని పెంచుకునేందుకు అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. భారత రాజకీయాలు కుటుంబ వ్యాపారంలా కొనసాగుతున్నంతకాలం, ప్రజల కోసం ప్రజల చేత నడిచే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే రాజకీయాల్లో ప్రతిభను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.  దీనికోసం ఓటర్లకు అవగాహన కల్పించడం, పార్టీ అంతర్గత ఎన్నికలను సమర్థంగా నిర్వహించడం వంటి ప్రాథమిక సంస్కరణలు అవసరమని చెప్పారు.

మరోవైపు శశి థరూర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ స్వాగతించింది. భారత రాజకీయాలు కుటుంబ వ్యాపారం ఎలా అయ్యాయో వివరించారని బీజేపీ జాతీయ ప్రతినిధి పునావాలా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన నేరుగా రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ను నెపో కిడ్స్గా పేర్కొన్నారని పేర్కొన్నారు. అందుకే ఈ కుటుంబ వారసులు చాయ్వాలా మోదీని ద్వేషిస్తున్నారని తెలిపారు. థరూర్ ఇలా బహిరంగంగా మాట్లాడినందుకు ఆయనపై కాంగ్రెస్ ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాలని వ్యంగ్యంగా చెప్పారు.