అరుంధతి రాయ్ రచన పాఠ్యాంశంగా తొలగింపు 

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఇంగ్లీషు సిలబస్‌లో ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ రచించిన ‘వాకింగ్‌ విత్‌ ది కామ్రేడ్స్‌’ పుస్తకాన్ని పాఠ్యాంశంగా చేర్చడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తిరువనెల్విలోని మనోన్మానియం సుందరనార్‌ విశ్వవిద్యాలయం ఆ పాఠాన్ని ఉపసంహరించుకుంది.

మావోయిస్టుల రహస్య స్థావరాల సందర్శన ఆధారంగా అరుంధతి ఈ పుసక్తం రచించారు. వైస్‌ చాన్సలర్‌ కె. పిచ్చుమణి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పాఠ్యాంశాన్ని తొలగించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ పాఠ్యాంశం స్థానంలో ప్రకృతి శాస్త్రవేత్త ఎం కృష్ణన్‌ రచించిన ‘మై నేటివ్‌ ల్యాండ్‌ ఎస్సేస్‌ ఆన్‌ నేచర్‌’ నుండి కొన్ని వ్యాసాలతో భర్తీ చేయాలని నిర్ణయించారు.

అరుంధతీ రాయ్ రచించిన ఈ పుస్తకాన్ని 2017లో సిలబస్‌లో చేర్చామని, మావోయిస్టుల పట్ల రచయిత్రి అనుకూల వైఖరితో వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ అంశంపై చర్చించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఆ పాఠ్యాంశాలను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు వైస్‌ చాన్సలర్‌ పేర్కొన్నారు. 

ఎబివిపితో పాటు, ఇతరులు కూడా ఫిర్యాదు చేశారని, ఇతర సమస్యలు లేవనెత్తడంతో ఆ పుస్తకాన్ని సిలబస్‌ నుండి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పుస్తకం ఎంఎ ఇంగ్లీష్‌ మూడవ సెమిస్టర్‌లో భాగంగా సిలబస్‌గా మూడేళ్ల క్రితం చేర్చారు. ఆమె 2010 ఓ మ్యాగ్జైన్‌ కోసం ఈ వ్యాసం రాశారు. 

జాతి వ్యతిరేకులైన మావోయిస్టుల..అల్లర్లు, హత్యలకు బహిరంగా మద్దతునిస్తున్నారని పేర్కొంటూ ఈ పాఠ్యాంశాన్ని తొలగించాలంటూ ఎబివిపి దక్షిణ తమిళనాడు జాయింట్‌ సెక్రటరీ సి. విఘ్నేష్‌ వైస్‌ చాన్సలర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ పుస్తకాన్ని పాఠ్యాంశంగా తొలగించకపోతే కేంద్ర విద్యా శాఖకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు. దీంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ సైతం ఈ పుస్తకానికి వ్యతిరేకత వ్యక్తం చేసింది.