జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తాం

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ (టీజెఏ) నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని
సంఘం వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన భద్రత కోసం సంఘం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా టీజేఏను మరింత బలోపేతం చేయడానికి అన్ని జిల్లాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి, అర్హులైన జర్నలిస్టులను సంఘంలో భాగస్వాములను చేయాలని సూచించారు. 

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, బస్సు, రైల్వే పాసుల కోసం కృషి చేయాలని జిల్లా కమిటీలను ఆదేశించారు. జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఉప్పల లక్ష్మణ్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు, ప్రయాణ సౌకర్యం కోసం బస్సు పాసులు, రైల్వే పాసులు తదితర సంక్షేమ సదుపాయాలు కల్పించాలనే అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. 

జర్నలిజం వృత్తిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం నాయకులు, సభ్యులు వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు కె,వెంకటరమణ రావు, ప్రధాన కార్యదర్శి ఎం ఆర్,గోరి, ఎన్‌యూజే (ఐ) వైస్ ప్రెసిడెంట్ రాజ్‌నాథ్, రాష్ట్ర కార్యదర్శి రాజలింగం, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన అక్రిడేషన్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, పాల్గొన్నారు.  ప్రస్తుత రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నూతన రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారిగా కాసీంను సమావేశంలో నియమించారు. ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

About The Author