మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల వేలంకు బిజెపి వ్యతిరేకం

మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101 పరిధిలో గల 550 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. మియాపూర్‌లోని ఎం.ఏ. నగర్, ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, దీప్తిశ్రీ నగర్ కాలనీలలో ఆయన పర్యటించి, తమ నివాసాలను కోల్పోతామన్న భయాందోళనలో ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక ఏళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న ఈ 550 ఎకరాల భూమిపై ఇటీవల సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను వేలం వేసి అమ్ముకోవాలని చూడటం దారుణమని విమర్శించారు. ఈ 550 ఎకరాలలో దాదాపు 150 ఎకరాల భూమిలో 1983 నుండే అధికారిక రిజిస్ట్రేషన్లు, హెచ్ఎండీఏ అప్రూవ్డ్ లేఅవుట్లు, బ్యాంకు లోన్ల ద్వారా మధ్యతరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు.

 
అలాగే జీవో నంబర్ 58, 59, 60ల కింద పేదలు క్రమబద్ధీకరించుకున్న 68 గజాల స్థలాలు, బస్తీలలో దాదాపు 10 నుండి 15 వేల కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నాయని పేర్కొన్నారు. 30 ఏళ్లకు పైగా వారి స్వాధీనంలో ఉన్న ఈ 150 ఎకరాల భూమి, ఇళ్లు కచ్చితంగా ఆయా కుటుంబాలకే చెందాలని, ప్రభుత్వం వాటి జోలికి వెళ్లకూడదని ఆయన డిమాండ్ చేశారు.

ఖాళీగా ఉన్న మిగిలిన 400 ఎకరాల భూమిని 2,500 నుండి 5,000 గజాల ప్లాట్లుగా విభజించి బహిరంగ వేలంలో అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాంచందర్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ భూములను అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని విమర్శించారు. 

 
పెరుగుతున్న కాలుష్యం, పట్టణీకరణ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ‘లంగ్ స్పేసెస్’ (స్వచ్ఛమైన గాలినిచ్చే ఖాళీ ప్రదేశాలు) ఎంతో అవసరమని చెప్పారు. అందువల్ల ఈ 400 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టకుండా పార్కులు, ప్లే గ్రౌండ్స్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణం వంటి ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని స్థానికుల పక్షాన బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.

ప్రజా సంక్షేమం కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించిన ఆయన, ప్రజల హక్కులు, నివాసాలను కాపాడేందుకు అవసరమైతే న్యాయపోరాటం (కోర్టుకు వెళ్లడం) చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రభుత్వ భూముల వేలాన్ని నిరసిస్తూ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ‘లక్ష సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, స్వయంగా తానే మొదటి సంతకం చేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సేకరించిన లక్ష సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వివరించారు.

About The Author