ఢిల్లీ శాంగ్రిలా హోటల్లో మద్యం మత్తులో దుర్భాషలాడుకొని, బహిరంగంగా గహర్షణకు దిగిన మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుల వ్యవహారం పరిష్కరించేందుకు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. వారిద్దరి మధ్య సయోధ్య కుదిరిచ్చేందుకు గాంధీ భవన్కు విచారణకు పిలవగా, ఇద్దరూ ముఖంచాటేసారు. పీసీసీ అధ్యక్షుడిగా పిలిచినా ఇద్దరు నేతలు రాకపోవడంతో ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసి ఏఐసీసీకి పంపనున్నట్లు తెలుస్తోంది.
మంత్రి, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, బహిరంగంగా రచ్చకెక్కడం సరికాదని, ఉన్నత పదవుల్లో ఉన్నవారే ఇలా చేస్తే ఎలా అని పార్టీ నాయకత్వం అసహనం వ్యక్తం చేస్తున్నది. అయితే, మహేష్ కుమార్ గౌడ్ స్థాయి ఏంటో తెలుసుకోవాలని, సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడిని టీపీసీసీ విచారణకు పిలవడం ఏంటని దామోదర రాజనర్సింహ తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు హాజరు కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దామోదర రాజనర్సింహ విచారణకు హాజరు కాకపోవడంతో తానెందుకు విచారణకు రావాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సైతం డుమ్మా కొట్టారు. ఇద్దరూ రాకపోవడంతో చేసేదేమీ లేక మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ నుంచి నిరాశగా వెళ్లిపోయాడు.
మరోవంక, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు మధ్య వివాదం మరింత ముదురుతోంది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఇటీవల పెట్టిన ట్వీట్ సంచలనం రేపుతోంది. అక్కడ ఎంపీ కార్యక్రమాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి శ్రీధర్ బాబు సస్పెండ్ చేయించినట్లు ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు.
మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకే తమను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ ఎంపీ వంశీకృష్ణ అనుచరులు గాంధీభవన్లో పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఎలాంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా, తమ వివరణ తీసుకోకుండానే సస్పెన్షన్ విధించడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం హుజూర్నగర్కు మంత్రినా? లేక రాష్ట్రానికా అని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గానికి రూ.300 కోట్లు మంజూరు చేస్తే ప్రాజెక్టులు పూర్తి అయ్యి సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సుశీ ఇన్ఫ్రా కంపెనీ రేడియల్ రోడ్ల కాంట్రాక్టులో రూ.600 కోట్ల తక్కువకు టెండర్ కోట్ చేసినా దక్కకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తానని చెప్పారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన తనకు బిల్లులు పాస్ కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొద్ది రోజులు నిశ్శబ్ధంగా ఉన్న కాంగ్రెస్ నేతలు మళ్లీ అసంతృప్తి గళాన్ని అందుకోవడం చర్చనీయాంశంగా మారింది.

More Stories
ఊపందుకొంటున్న ఎన్సిపి విలీన చర్చలు.. సునేత్ర, పార్థ్ వ్యతిరేకత
ముంబైలో అమితాబ్ తో సహా బాంబు బెదిరింపుల కలకలం
యుపిలో ప్రకృతి వైపరీత్యాల్లో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం రెట్టింపు