భారత స్టార్‌ పేసర్‌ హమ్మద్‌ షమీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు

భారత స్టార్‌ పేసర్‌ మపేసర్‌ హమ్మద్‌ షమీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 13 ఏళ్ల పాటు సాగిన తన ప్రయాణానికి శుక్రవారం ముగింపు పలికాడు. ఈ మేర‌కు సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకుంటూ ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. తన కెరీర్‌లో అండగా నిలిచిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, బీసీసీ, బెంగాల్‌ క్రికెట్‌ సంఘానికి కృతజ్ఞతలు తెలిపాడు.

భావోద్వేగంతో కూడిన వీడ్కోలు సందేశాన్ని పంచుకుంటూ షమీ ఇలా రాశారు:”నేను తెల్లటి జెర్సీని వదిలేస్తున్నాను, కానీ దానితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికీ వదిలిపెట్టను. నేను మొదటిసారిగా భారత టెస్టు జెర్సీని ధరించినప్పుడు, నా దేశం కోసం ఏదైనా చేయాలనే ఒకే ఒక్క కల ఉండేది. ఆ తర్వాత ప్రతి వికెట్, ప్రతి పోరాటం, ప్రతి గాయం, ప్రతి పునరాగమనం నాకు ఏదో ఒక పాఠాన్ని నేర్పాయి.” టెస్టు క్రికెట్ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన భాగమని  పేర్కొన్నాడు. 

2013 నవంబర్‌ 6న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో షమీ టెస్టు అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టి తన రాకను చాటుకున్నాడు. ఇక‌ చివరిసారిగా 2023 జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆడాడు. ఆ తర్వాత గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా టెస్టులకు దూరమయ్యాడు. ఇప్పుడు అధికారికంగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

షమీ తన టెస్టు కెరీర్‌లో 64 మ్యాచ్‌లు ఆడి 229 వికెట్లు పడగొట్టాడు. 12 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2018లో పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 56 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టడం అతడి అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన. షమీ మొత్తం 11,515 బంతులు వేసి, 6,346 పరుగులు ఇచ్చాడు. సగటు 27.70గా, ఎకానమీ రేటు 3.31గా, స్ట్రైక్ రేటు 50.3గా ఉన్నాయి. 

బ్యాటింగ్ విషయానికి వస్తే, ష‌మీ 64 టెస్టు మ్యాచ్‌లలో 89 ఇన్నింగ్స్‌లు ఆడి, మొత్తం 750 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 56 (నాటౌట్) కాగా, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. భారత పేస్‌ దళంలో కీలక బౌలర్‌గా ఎదిగిన షమీ తన పదునైన సీమ్‌ బౌలింగ్‌, రివర్స్‌ స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై కీలక వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. 

గాయాల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాల్లోనూ తిరిగి పుంజుకుని తన సత్తా చాటాడు. టెస్టులకు వీడ్కోలు పలికినప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగనున్నాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.  

About The Author