మహాదేవ్ యాప్ బెట్టింగ్ కింగ్‌పిన్ సౌరభ్ ను అప్పగించిన ఒమన్‌

మహాదేవ్ యాప్ అక్రమ బెట్టింగ్ సిండికేట్ సూత్రధారి సౌరభ్ చంద్రకర్‌ను ఒమన్ సుల్తానేట్ నుండి అప్పగించేలా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం చర్యలు చేపట్టింది. ఒమన్‌కు ప్రత్యేకంగా పంపిన సీబీఐ బృందం అతడిని భారతదేశానికి తీసుకువచ్చింది. ఇప్పుడు అతడిని రాయ్‌పూర్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో సోమవారం హాజరుపరుస్తారు. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేసిన రెండు సీబీఐ కేసులలో, ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసిన ఒక ఈడీ కేసులో చంద్రకర్ నిందితుడిగా ఉన్నాడు. 
 
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు సీబీఐ మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ కేసుల దర్యాప్తును చేపట్టింది. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్, భారతదేశం వెలుపల నుండి నడుస్తున్న దేశంలోని అతిపెద్ద రూ. 6,000 కోట్ల అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ సిండికేట్‌లలో ఒకటిగా ఆరోపణలు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. భారతదేశం అంతటా విస్తరించి ఉన్న ఫ్రాంచైజ్డ్ ‘ప్యానెల్స్’ , ‘బ్రాంచ్‌ల’ నెట్‌వర్క్ ద్వారా క్రికెట్, ఫుట్‌బాల్, కార్డ్ గేమ్స్, ఇతర ఈవెంట్‌లపై ఇది చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌ను అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
ఈ ప్యానెల్స్, బ్రాంచ్‌లు వినియోగదారులను నమోదు చేసుకుని, వారి నుండి పందాలను వసూలు చేశాయి. ఈ చట్టవిరుద్ధమైన బెట్టింగ్ ద్వారా వచ్చిన సొమ్మును పెద్ద సంఖ్యలో ఉన్న మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా మళ్లించి, పలు లావాదేవీల ద్వారా విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సిండికేట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేయడానికి వీలుగా, వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ డబ్బు చెల్లించడానికి ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 
 
సీబీఐ, అవినీతి నిరోధక చట్టం, 1988, భారత శిక్షాస్మృతిలోని నేరపూరిత కుట్ర, మోసం మరియు ఫోర్జరీకి సంబంధించిన నిబంధనలు, అలాగే ఛత్తీస్‌గఢ్ జూదం (నిషేధం) చట్టం కింద ఛార్జిషీట్లను దాఖలు చేసింది. ఈడీ, భారతదేశంలో,  విదేశాలలో ఉన్న అనేక ఆస్తులను జప్తు చేసింది. సౌరభ్ చంద్రకర్‌పై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా, రాయల్ ఒమన్ పోలీసులు అతని ఆచూకీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
నిందితుడిపై సేకరించిన అన్ని ఆధారాలతో పాటు, సీబీఐ, ఈడీ వెంటనే ఒమన్ సుల్తానేట్‌కు అధికారిక అప్పగింత ప్రతిపాదనలను పంపాయి. భారత ప్రభుత్వ ఏజెన్సీలు, ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరోల సమన్వయంతో, ఒమన్ సుల్తానేట్‌లోని సంబంధిత అధికారుల మద్దతుతో ఈ అప్పగింత అభ్యర్థనను ముందుకు తీసుకెళ్లినట్లు భద్రతా వర్గాల వర్గాలు తెలిపాయి. అతని అప్పగింతకు అనుమతి లభించడంతో, సీబీఐ బృందం మస్కట్‌కు వెళ్లి, అతడిని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చింది. 

About The Author