అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలికపై శనివారం ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఉన్మాది హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు ఆత్మకూరు అటవీప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించామని, ఈ క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించిన హేమంత్పై 6 రౌండ్లు కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు.
ఆ సమయంలో హేమంత్ పారిపోయేందుకు ప్రయత్నిస్తూ సీఐపై కత్తితో దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఈ క్రమంలో కాల్పులు జరిపారు. నిందితుడికి తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆసుపత్రిలో గాయపడిన నిందితుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. ముందస్తు జాగ్రత్తగా హేమంత్ చికిత్సపొందుతున్న ఆసుపత్రి దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హేమంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. రాప్తాడులో శనివారం రోజు ఈ ఘటన జరిగిన తర్వాత 25 టీమ్లు రంగంలోకి దించి గాలించామన్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నారని సమాచారం వచ్చిందన్నారు. వెంటనే రెండు టీమ్లను అక్కడికి పంపించామని, అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నించామని పేర్కొన్నారు.
అప్పుడు హేమంత్ ప్రతిఘటించారని, దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి హెచ్చరించారని తెలిపేరు. అయినా అతను వెనక్కు తగ్గలేదని, పోలీసులపై అతడి దగ్గర ఉన్న కత్తితో దాడికి ప్రయత్నించాడని చెప్పారు. పోలీసులు మళ్లీ హెచ్చరించగా అతడు వెనక్కు తగ్గకుండా సీఐపై కత్తితో దాడి చేశాడని ఎస్పీ జగదీష్ వివరించారు. అప్పుడు పోలీసులు కాల్పులు జరిపారని.. మొత్తం 6 రౌండ్లు వరకు కాల్పులు జరిపారని చెప్పారు.
ఈ కాల్పుల్లో హేమంత్ తీవ్రంగా గాయపడగా.. వెంటనే ఆస్పత్రికి తరలించామమని చెబుతూ పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. రాప్తాడులోని పాఠశాలలో తరగతి గదిలోకి చొరబడిన హేమంత్, అత్యంత అమానుష ఘాతుకానికి ఒడిగట్టాడు. పదోతరగతి చదువుతున్న బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు.
రాప్తాడు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన గోపిక రాప్తాడు జడ్పీ పాఠశాలలో చదువుతోంది. ఉదయం తరగతి గదిలో ఉండగా, వరుసకు బాబాయ్ అయ్యే హేమంత్ ఒక్కసారిగా ఎలక్ట్రిక్ రంపంతో లోపలికి ప్రవేశించి పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో 15 ఏళ్ల బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో లోతైన గాయాలయ్యాయి. తరగతిలో జరుగుతున్న ఈ దారుణాన్ని చూసి అంతా భయాందోళనకు గురయ్యారు.
లక్ష్మి అనే విద్యార్థిని మాత్రం ధైర్యంగా ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె రెండు కాళ్లకూ తీవ్ర గాయాలయ్యాయి. అంతా కేకలు వేయడంతో నిందితుడు రంపాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. రక్తపుమడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న గోపిక, గాయపడిన లక్ష్మిని స్థానికులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతోంది.
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బెంగళూరు వెళ్లి బాలికను, ఆమె తల్లిదండుల్ని పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పెళ్లి చేసుకొనేందుకు ఆ బాలిక తిరస్కరిస్తూ ఉండడంతో ఉన్మాది ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. విద్యార్థిని ప్రాణాలను కాపాడటమే ప్రాథమిక లక్ష్యంగా అత్యవసర వైద్య సహాయం అందుబాటులోకి తెచ్చినట్లు లోకేష్ తెలిపారు.
బాధిత విద్యార్థినికి అత్యుత్తమ వైద్యం అందించే పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు అధికారులను ఆదేశించామని నారా లోకేష్ వివరించారు.

More Stories
ఒంగోలు సమీపంలో మురసు తుఫాన్ తీరం దాటే అవకాశం
హైలో ఓపెన్ విజేతలుగా పీవీ సింధు, లక్ష్యసేన్
రామ్లీలా మైదానంలో 10 లక్షల మంది ఎక్కడ రాహుల్!.. బీజేపీ