రాజీనామా చేసిన గంటల్లోనే బీజేపీలో చేరిన ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలురాబోయే పంజాబ్ శాసనసభ ఎన్నికలకు ముందు అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని రాజకీయ సవాలు ఎదురైంది. సోమవారం నాడు ఆప్ పార్టీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, అమృత్సర్ నార్త్ శాసనసభ్యుడు కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ తన పదవికి రాజీనామా చేసి, కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీలో చేరారు.
ఆయనతో పాటు గతంలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పాటియాలా జిల్లాకు చెందిన సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జోరామజ్రా, సనూర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా కూడా బీజేపీ జాతీయ కార్యాలయంలో పంజాబ్ బీజేపీ ఇంచార్జీ సతీశ్ పూనియా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కో-ఇంచార్జీ విరేంద్ర సచ్దేవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేవాల్ సింగ్ థిల్లాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై గతంలోనే ఈ ముగ్గురినీ ఆప్ నాయకత్వం సస్పెండ్ చేసింది.
అనంతరం ముగ్గురు నేతలు బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి చేతులు పైకెత్తి తమ ఐక్యతను ప్రదర్శించారు. బీజేపీ జిందాబాద్ అని ఆ ముగ్గురు నినాదాలు చేశారు. శనివారం నాడు ఆప్ రాబోయే ఎన్నికల కోసం 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన వెంటనే ఈ రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. బీజేపీలో చేరిన అనంతరం మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంజాబ్‌ను ఆక్రమించిన డ్రగ్స్ సంస్కృతి, గ్యాంగ్స్టరిజం, వసూళ్లు, అవినీతి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యాయం ముగిసిందని పేర్కొంటూ కేజ్రీవాల్, భగవంత్ మాన్ల వైఫల్యాల వల్లే పార్టీ నాశనం అయిందని విమర్శించారు. పంజాబ్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను అమృత్‌సర్‌లో ఎస్పీగా పని చేసిన కాలంలో డ్రగ్స్, నేరాలను అణచివేశానని, తాను వెళ్లిన తర్వాత మళ్లీ పరిస్థితులు దిగజారాయని గుర్తు చేశారు.
మరో ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా మాట్లాడుతూ ఆరంభంలో ఆప్ చూపిన ఆకర్షణీయమైన సిద్ధాంతాలకే తాము ఆకర్షితులమయ్యామని, అయితే అధికారంలోకి వచ్చాక పంజాబ్ కోసం నిజాయితీగా మాట్లాడే నాయకుల రెక్కలను కత్తిరించడం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ‘ఉడ్తా పంజాబ్’గా మారిన రాష్ట్రాన్ని ‘ఉభర్తా పంజాబ్’గా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.పంజాబ్ తన అస్థిత్వం కోసం పోరాడుతోందని, పంజాబ్ సింధు గుజరాత మరాఠ అని పంజాబ్‌కు ఎంతో గౌరవం ఇచ్చారని, కానీ ఇప్పుడు రాష్ట్రం దయనీయంగా మారిందని, గత అయిదేళ్ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీతో తాను ఇంటెర్న్‌షిప్‌లో ఉన్నట్లు కున్వర్ విజయ్ ప్రతాప్ తెలిపారు.
కాగా, ఈ పరిణామాలపై శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పందిస్తూ ఆప్ పతనం ప్రారంభమైందని, రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా ధూరీ నియోజకవర్గం నుంచి ఓడిపోతారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో, పంజాబ్ బీజేపీ ఇన్ఛార్జ్ సతీష్ పూనియా మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం పంజాబ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అని, ఈ సమస్య రాష్ట్రంలోని యువతను నాశనం చేసిందని ఆరోపించారు.
“క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు మాకు ఒక విషయం స్పష్టమైంది: పంజాబ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు మాదకద్రవ్యాల వినియోగం. ఈ వ్యసనం పంజాబ్ యువతను సర్వనాశనం చేసింది” అని ఆయన పేర్కొన్నారు. పంజాబ్ మరియు హర్యానాలను పోల్చిన పూనియా, పంజాబ్ నుండి విడిపోయిన తర్వాత గత 60 ఏళ్లలో హర్యానా క్రీడలు, పెట్టుబడులు, ఇతర రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిందని తెలిపారు.
“నేడు ఈ రెండు రాష్ట్రాలను పోల్చి చూస్తే, హర్యానాకు చెందిన యువ క్రీడాకారులు ఆసియా క్రీడల్లో 27 పతకాలను గెలుచుకున్నారు. హర్యానా ఎలా ఉపాధి కల్పించగలిగింది, పెట్టుబడులను ఎలా ఆకర్షించగలిగింది, రాష్ట్రంలో ఎలా సమృద్ధిని తీసుకురాగలిగింది అని ఇప్పుడు పంజాబ్ ఆశ్చర్యంగా చూస్తోంది” అని ఆయన చెప్పారు. పంజాబ్‌కు పూర్వ వైభవాన్ని, సమృద్ధిని తిరిగి తీసుకురావడానికి బీజేపీ కట్టుబడి ఉందని పూనియా తెలిపారు.
పంజాబ్‌లో తమ ఉనికిని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, శాంతిభద్రతలు, పాలనాపరమైన అంశాలపై మన్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలను తీవ్రతరం చేసింది. రాబోయే ఎన్నికల ప్రచారంలో ఈ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఈ పరిణామాలు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను 92 స్థానాలను గెలుచుకుని ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రస్తుతం తన అంతర్గత విభేదాలను ఏ మేరకు అదుపులో ఉంచుకోగలదనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

More Stories
ఆప్ కు మరో ఎమ్యెల్యే, మాజీ ఐపీఎస్ రాజీనామా
రాప్తాడు బాలికపై దాడి చేసిన ఉన్మాదిపై పోలీసుల కాల్పులు
హైలో ఓపెన్ విజేతలుగా పీవీ సింధు, లక్ష్యసేన్