137 రకాల క్యాన్సర్ మందులపై మార్జిన్‌ 30 శాతానికి పరిమితం

క్యాన్సర్ ఔషధాల ధరలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 137 రకాల మందులపై వాణిజ్య మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేసింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా 543 బ్రాండ్ల సవరించిన ధరలు నవంబరు 9 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే అన్ని మందుల ధరలు ఒకే స్థాయిలో తగ్గవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. క్యాన్సర్ పేరు వింటేనే రోగులు, వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతాయి. వ్యాధిని ఎదుర్కోవడమే ఒక సమస్య కాగా, చికిత్స ఖర్చును భరించడం మరో పెద్ద సవాలుగా మారుతుంది. 
 
శస్త్రచికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్, పరీక్షలు, ఆసుపత్రి బిల్లులకు తోడు ఖరీదైన ఔషధాలు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని కుదేలు చేస్తున్నాయి. ఔషధాల పంపిణీ వ్యవస్థలో అధిక ట్రేడ్ మార్జిన్లు రోగులపై అదనపు భారాన్ని మోపుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.   క్యాన్సర్ మందుల ధరలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఈ నెల 17న కీలక నిర్ణయం ప్రకటించింది. 
 
ధరల నియంత్రణ జాబితాలో లేని 137 రకాల క్యాన్సర్ ఔషధాలపై ట్రేడ్ మార్జిన్‌ను ఎంఆర్పీ ధరలో 30 శాతానికి పరిమితం చేసింది. ఈ చర్యతో ఎంపిక చేసిన ఔషధాల ధరలు కొన్ని సందర్భాల్లో 70 శాతం వరకు తగ్గవచ్చని కేంద్రం అంచనా వేసింది. రోగులకు ఏటా సుమారు రూ.2,500 కోట్ల మేర ఆదా కావచ్చని తెలిపింది. ఈ జాబితాలో 20కి పైగా రకాల క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే కొన్ని ఇమ్యునోథెరపీ మందులతోపాటు రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు, అండాశయ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల చికిత్సకు ఉపయోగించే ఔషధాలు ఉన్నాయి. 
 
అయితే ధరల నియంత్రణలో ట్రేడ్ మార్జిన్‌ను పరిమితం చేయడం, తయారీదారు నిర్ణయించే మూల ధరపై నేరుగా గరిష్ఠ పరిమితి విధించడం రెండూ వేర్వేరు చర్యలు. అందువల్ల అన్ని ఔషధాల ధరలు ఒకే శాతంలో తగ్గవు. కేంద్రం ప్రకటించిన మార్జిన్ నియంత్రణకు అనుగుణంగా ఔషధ కంపెనీలు సమర్పించిన వివరాల ఆధారంగా ఎన్‌పీపీఏ ఈ నెల 28న 543 బ్రాండ్ల క్యాన్సర్ మందుల సవరించిన ఎంఆర్పీ ధరల జాబితాను విడుదల చేసింది. ఈ ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
తయారీ సంస్థలు కొత్త ధరలను తమ వెబ్‌సైట్లలో ప్రచురించడంతోపాటు ఆసుపత్రులు, ఔషధ విక్రయ కేంద్రాలకు తెలియజేయాలి. ఆసుపత్రి ఫార్మసీల్లోనూ సవరించిన ధరలను అమలు చేయాలి.  కొన్ని బ్రాండ్ల ధరల్లో కొంతమేర తగ్గింపులు నమోదయ్యాయి. ఉదాహరణకు, థియోపేట ఔషధం బ్రాండ్ సంపేట ఇంజెక్షన్ ధర రూ.80,072 నుంచి రూ.7,150కు తగ్గింది. అలాగే పర్టుజుమాబ్ ఔషధం బ్రాండ్ హెర్టుమబ్ ఇంజెక్షన్ ధర రూ.94,951 నుంచి రూ.30,593కు తగ్గింది. బెవసిజుమాబ్ ఔషధం బ్రాండ్ ఐజుమాబ్ ఇంజెక్షన్ ధర రూ.69,852 నుంచి రూ.13,512కు సవరించారు.  
 
అయితే ఇవి ఎంపిక చేసిన బ్రాండ్ల ఉదాహరణలు మాత్రమే. ప్రతి ఔషధం, ప్రతి బ్రాండ్‌కు ఇంతే స్థాయిలో ధర తగ్గింపు ఉండదు. దీనికి ప్రధాన కారణం ధరల నియంత్రణ విధానం. ప్రభుత్వం ఈసారి మందుల తయారీదారులు నిర్ణయించే ప్రతి ధరను నేరుగా తగ్గించలేదు. మందుల సరఫరా వ్యవస్థలో మధ్యవర్తులు కలిపే లాభ మార్జిన్లను పరిమితం చేసింది. అందువల్ల సరఫరా వ్యవస్థలో భారీ మార్జిన్లు ఉన్న కొన్ని మందుల ధరలు గణనీయంగా తగ్గాయి. తయారీదారు నిర్ణయించిన ధరే ఎక్కువగా ఉన్న మందులపై మాత్రం ఈ చర్య ప్రభావం చూపలేదు. 
 
 ఖరీదైన మందులకు పూర్తి ఉపశమనం లేదా? ట్రేడ్ మార్జిన్ల నియంత్రణతో కొన్ని జనరిక్, బయోసిమిలర్ ఔషధాల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే తయారీదారు నిర్ణయించే ప్రారంభ ధరే అధికంగా ఉండి, ప్రత్యామ్నాయ సరఫరాదారులు పరిమితంగా ఉన్న మందుల విషయంలో తగ్గింపు తక్కువగా ఉండొచ్చు. తాజా ధరల సవరణలోనూ కొన్ని ఖరీదైన క్యాన్సర్ ఔషధాల ధరలు మారలేదు. కేవలం ట్రేడ్ మార్జిన్ పరిమితులు విధించడం వల్ల రోగులకు లభించే ప్రయోజనం నామమాత్రమేనని ఆరోగ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 
 
అంతేకాకుండా క్యాన్సర్ చికిత్స ఖర్చు కేవలం మందులకే పరిమితం కాదు. పరీక్షలు, ఆసుపత్రి వసతి, శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ వంటి ఇతర సేవల ఖర్చులూ ఉంటాయి. మందుల ధర తగ్గినా మొత్తం చికిత్స బిల్లు అదే స్థాయిలో తగ్గుతుందని చెప్పలేం. అందువల్ల ఔషధాల ధరలతోపాటు ఆసుపత్రి బిల్లుల్లో పారదర్శకత, రోగులకు అందించే రాయితీలు, బీమా పథకాల ప్రయోజనాల అమలుపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
 
 ధరల నియంత్రణ ఉత్తర్వులు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడటం కీలకం. తయారీదారులు, పంపిణీదారులు, రిటైల్ ఫార్మసీలు, ఆసుపత్రులు నవంబరు 9 నుంచి సవరించిన ధరలనే వసూలు చేస్తున్నాయా, పాత ధరల పేరుతో అధిక మొత్తాలు తీసుకుంటున్నాయా అనే అంశాలపై రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలి. రోగులకు బిల్లు ఇవ్వడం, మందుల అసలు ధరలను స్పష్టంగా ప్రదర్శించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించడం వంటి చర్యలు అవసరం. ఔషధాల గరిష్ఠ చిల్లర ధరలను ఎన్‌పీపీఏ వెబ్‌సైట్ ద్వారా పరిశీలించవచ్చు. 

About The Author