బిజెపి కార్యాలయంలో సర్దార్ పటేల్ కు ఘనంగా నివాళులు

భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  జి. కిషన్ రెడ్డి  ముఖ్య అతిథులుగా పాల్గొని సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో చే
 
వెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గార,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతం రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కర్ణాటక సహ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆ తర్వాత, అసెంబ్లీ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ సభ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్  దేశ మొదటి ప్రధానమంత్రి కావాలని సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు.
అయితే, నాటి నెహ్రూ కుటుంబం అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, మొదటి ‘ఓటు చోరీ’కి పాల్పడి ఏమాత్రం ప్రజా మద్దతు లేని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిందని విమర్శించారు.  ఒకవేళ ఆనాడే పటేల్ తొలి ప్రధాని అయ్యి ఉంటే దేశ రూపురేఖలు, ముఖచిత్రం పూర్తిగా మారిపోయేవని, దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కేదని పేర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ లోపాయికారీ ఒప్పందాలు, స్వార్థ రాజకీయ విధానాల వల్ల సంస్థానాల విలీన ప్రక్రియలో తీవ్ర గందరగోళం ఏర్పడిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 
 
నెహ్రూ చారిత్రక తప్పిదాల వల్ల సరిహద్దు ఉగ్రవాదం, యుద్ధాలు చెలరేగి సుమారు 46 వేల మంది అమాయక పౌరులు, జవాన్లు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత నకిలీ నోట్లు, ఆయుధాల అక్రమ రవాణా, రక్తపాతానికి నెహ్రూ విధానాలే కారణమని స్పష్టం చేశారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో ఆర్టికల్ 370ని రద్దు చేసి, కశ్మీర్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసి పటేల్ కన్న కలలను సాకారం చేశారని కొనియాడారు. 
దేశ సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణ కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని రాంచందర్ రావు కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ వందలాది సంస్థానాలను ఏకం చేసి ఆధునిక భారతదేశానికి పటిష్టమైన పునాది వేసిన ఘనత పటేల్‌దేనని పేర్కొన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల పాటు పటేల్ సేవలను మరుగున పరిచే ప్రయత్నం చేశాయని విమర్శించారు. తెలంగాణ విముక్తిలో సర్దార్ పటేల్ పాత్ర అజరామరమని, నేటి యువత ఆయన క్రమశిక్షణ, దేశభక్తి, నిస్వార్థ సేవలను ఆదర్శంగా తీసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

About The Author