పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులైన వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ మొదటగా హౌరా- కామాఖ్య మధ్య ఇదివరకే అందుబాటులోకి రాగా, మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ ఆదివారం పట్టాలెక్కింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొద్దిసేపటి కిందటే జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హెచ్.డి. కుమారస్వామి, సహాయ మంత్రులు వి. సోమన్న, శోభా కరంద్లాజె, పార్లమెంటు సభ్యులు తేజస్వి సూర్య, పి.సి. మోహన్, సి.ఎన్. మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరు- ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ ముంబై మధ్య రాకపోకలు సాగించే ఈ స్లీపర్ రైలు సోమవారం మినహా మిగిలిన అన్ని రోజులూ సాయంత్రం 7:45 నిమిషాలకు బెంగళూరు నుంచి బయలు దేరుతుంది. నంబర్ 27652 వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు ఉదయం 11:55 నిమిషాలకు ముంబైకి చేరుకుంటుంది.
“కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా, బెంగళూరు- ముంబై మధ్య ‘వందే భారత్ స్లీపర్’ సేవను ప్రారంభిస్తున్నాం. ఇది చాలా మంచి రైలు. ఇది సాంకేతిక రాజధాని బెంగళూరును, ఆర్థిక రాజధాని ముంబైతో అనుసంధానిస్తుంది. ఇది మూడవ వందే భారత్ సేవ అవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ రైలు రూపకల్పనలో అనేక కొత్త ఫీచర్లను చేర్చినట్లు ఆయన తెలిపారు.
లోకోమోటివ్ పైలట్ల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు, బెర్త్లపైకి ఎక్కడాన్ని సులభతరం చేసేందుకు అదనపు ఏర్పాట్లు చేశారు. అలాగే, దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక సౌకర్యాలను ఇందులో పొందుపరిచామని ఆయన చెప్పారు. “గత ఐదేళ్లలో కర్ణాటకలో రైల్వే అభివృద్ధి కోసం రూ. 52,000 కోట్లకు పైగా ఖర్చు చేశాం. దేశవ్యాప్తంగా 14,000 రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మించగా, అందులో 900కు పైగా కర్ణాటకలోనే ఉన్నాయి” అని సోమన్న పేర్కొన్నారు.
మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజులూ రాత్రి 8:10 నిమిషాలకు ముంబై నుంచి బయలుదేరే నంబర్ 27651 వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. బెంగళూరు- ముంబై మధ్య ఎనిమిది స్టేషన్లల్లో మాత్రమే దీనికి హాల్ట్ సౌకర్యం ఉంది. ఇందులో ఏపీలో రెండు, కర్ణాటకలో మూడు, మహారాష్ట్రలో మూడు స్టేషన్లు ఉన్నాయి.
బెంగళూరు నుంచి బయలుదేరే వందే భారత్ స్టీపర్ ఎక్స్ ప్రెస్ ఆ తర్వాత ఆగేది అనంతపురంలో మాత్రమే. దీని తర్వాత గుంతకల్లులో దీనికి హాల్ట్ సౌకర్యం ఉంది. అనంతరం రాయచూరు, యాద్గిర్, కలబురగి, షోలాపూర్, పూణె, కల్యాణ్ లల్లో ఆగుతుంది.

More Stories
రాజస్థాన్ విద్యార్థులకు రూ.100తో రూ.14 లక్షల ప్రమాద బీమా
పెట్రోల్ పై సుంకం రద్దు.. డీజిల్ పై పెంపు
20 నిమిషాల్లో రూ.52 వేల కోట్ల క్రిప్టో కరెన్సీ అదృశ్యం