పోలాండ్‌లో కోర్టు అధ్యక్షుడిని విధుల్లోంచి తొలగించిన న్యాయమూర్తి

 
* అర్ధరాత్రి రాజకీయ కల్లోలం..అధ్యక్షుడి పర్యటన మధ్యలోనే రద్దు 

పోలాండ్ దేశంలో న్యాయవ్యవస్థ నియంత్రణ, రాజ్యాంగ ఆధిక్యతపై ప్రధాని డోనాల్డ్ టస్క్ ఆధ్వర్యంలోని యూరోపియన్ అనుకూల ప్రభుత్వానికి, ప్రతిపక్ష ‘లా అండ్ జస్టిస్’ (పిఐఎస్) పార్టీకి మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం తీవ్ర రూప దాల్చింది. న్యాయస్థానాల స్వాతంత్ర్యం, రాజ్యాంగ ట్రిబ్యునల్ కూర్పుపై జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు ఏకంగా రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది.

రాజ్యాంగ ట్రిబ్యునల్ అధ్యక్షుడు బోగ్డాన్ స్వియెంజ్కోవ్స్కీ సస్పెన్షన్ వేటును నిరసిస్తూ వందలాద మంది నిరసనకారులు రాజ్యాంగ ట్రిబ్యునల్ భవనం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులు కోర్టు భద్రతా కంచెలను దాటేందుకు ప్రయత్నించడం, అధికారులపై వస్తువులను విసరడంతో అక్క‌డ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలాండ్‌లో రాజ్యాంగ న్యాయస్థానం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. న్యాయస్థానం అధ్యక్షుడు బోగ్డాన్ స్వెంచ్‌కోవ్‌స్కీ సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనకారులు ఆందోళనకు దిగారు.

ఈ పరిణామాలతో దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ అధికారాలపై కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది. దీంతో పోలీసులు అలర్ట్ అయి అల్లర్ల నివారణ విభాగాన్ని రప్పించి కోర్టు భవనం చుట్టూ పహారా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో పోలీసులు ముగ్గురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ట్రిబ్యునల్ అధికారిక ఖాతా ఈ పరిణామాలను “ప్రభుత్వ మద్దతుతో జరుగుతున్న కుట్ర / తిరుగుబాటు” గా అభివర్ణించడం కలకలం రేపింది.

న్యాయ శాఖ మంత్రి వాల్డెమార్ జురెక్‌ ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. బోగ్డాన్ స్వియెంజ్కోవ్స్కీతో పాటు ట్రిబ్యునల్ ఉపాధ్యక్షుడు బార్టోమిజ్ సోచ్నాస్కీలపై క్రిమినల్ విచారణ చేపట్టేందుకు వీలుగా వారికి ఉన్న చట్టపరమైన ‘ఇమ్యూనిటీ’ (విచారణ మినహాయింపు హోదా) తొలగించాలని కోరారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష ‘PiS’ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టస్క్ నేతృత్వంలోని పాలక యంత్రాంగం రాజ్యాంగ వ్యవస్థలను, చట్టబద్ధమైన పాలనను పూర్తిగా దెబ్బతీస్తోందని నిప్పులు చెరిగారు.

ఈ ఊహించని ఉద్రిక్తతల నేపథ్యంలో ‘పిఐఎస్’ మద్దతు కలిగిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్‌రోకీ తీవ్రంగా స్పందించారు. ఆఫ్రికా ఖండంలోని సెనెగల్ రాజధాని డాకర్‌లో జరగబోయే వేసవి యూత్ ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం అధికారిక పర్యటన నిమిత్తం విమానంలో వెళ్తున్న ఆయన, దేశంలో సంక్షోభ పరిస్థితుల వార్త తెలిసిన వెంటనే పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని వార్సాకు తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ విషయమై అధ్యక్షుడు నవ్‌రోకీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందిస్తూ “ఇలాంటి అత్యవసరమైన, సవాలుతో కూడిన సమయంలో దేశాధ్యక్షుడు పోలాండ్‌లోనే ఉండాలి. అందుకే నేను సెనెగల్ పర్యటనను కుదించుకుని వార్సాకు తిరిగి వస్తున్నాను.” అని పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్‌రోకీ వెల్ల‌డించారు.

About The Author