ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ దాఖలు చేసిన సివిల్ దావాలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు మాజీ రా చీఫ్ సామంత్ గోయల్‌కు అమెరికా కోర్టు సమన్లు అందజేసేందుకు ఢిల్లీలోని మూడు జిల్లా కోర్టుల సహకారం కోరింది. ఈ మేరకు పత్రాలను కొరియర్ ద్వారా ఆయా కోర్టులకు పంపించాలని ఆదేశించింది.
ఖలిస్తానీ వేర్పాటువాది గుర్పత్వంత సింగ్ పన్నూన్ పలు ఉగ్రవాద ఆరోపణలపై భారత దర్యాప్తు సంస్థలకు కావలసిన వ్యక్తిగా ఉన్నారు. నవంబర్ 13 నాటి ఒక ఉత్తర్వులో, న్యూయార్క్ దక్షిణ జిల్లాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు, దోవల్ కోసం సమన్లు, వాటితో పాటు ఉన్న న్యాయ పత్రాలను పాటియాలా హౌస్ డిస్ట్రిక్ట్ కోర్టుకు, గోయల్ కోసం ద్వారకా, టిస్ హజారీ డిస్ట్రిక్ట్ కోర్టులకు పంపాలని తన క్లర్క్‌ను ఆదేశించింది.
“ఈ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ సివిల్ కేసులో ప్రతివాదులపై నోటీసులు జారీ చేయడంలో సహాయం అందించాలని కోర్టు స్వీకరించే భారతీయ కోర్టులను గౌరవపూర్వకంగా అభ్యర్థిస్తోంది,” అని న్యాయమూర్తి కేథరీన్ పోల్క్ ఫైలా జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. హేగ్ కన్వెన్షన్లు, భారత సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని సంబంధిత నిబంధనలను ఉటంకిస్తూ, విదేశీ కోర్టులు భారతీయ కోర్టుల ద్వారా దోవల్, గోయల్‌లకు సమన్లు జారీ చేయవచ్చని ఫైలా తెలిపారు.అమెరికాలో నివసిస్తున్న ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఈ కేసును దాఖలు చేశారు. తనను అమెరికా గడ్డపై హత్య చేసేందుకు కుట్ర జరిగిందని, అందులో భారత ప్రభుత్వానికి చెందిన కొందరు అధికారులు పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. ఈ సివిల్ దావాలో భారత ప్రభుత్వం, అజిత్ దోవల్, మాజీ రా చీఫ్ సామంత్ గోయల్‌తో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించారు.
అమెరికా కోర్టు గతంలో హెగ్ కన్వెన్షన్ ద్వారా సమన్లు అందజేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ ప్రక్రియ విజయవంతం కాలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గంలో పత్రాలను అందజేయడానికి అనుమతి కోరుతూ పన్నూన్ కోర్టును ఆశ్రయించారు. గతంలో అమెరికా పర్యటన సందర్భంగా అజిత్ దోవల్‌కు న్యాయపరమైన పత్రాలు అందజేయడానికి ప్రయత్నించినప్పటికీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పన్నూన్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఇప్పుడు ఢిల్లీలోని కోర్టుల ద్వారా పత్రాలను అందజేసే విధానానికి అమెరికా న్యాయస్థానం అనుమతించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్, ద్వారక, తీస్ హజారీ జిల్లా కోర్టులకు అవసరమైన న్యాయపరమైన పత్రాలను పంపించాలని అమెరికా కోర్టు క్లర్క్‌ను ఆదేశించింది.

More Stories
అణుయుద్ధంలో గెలవలేం, దానిని ఎన్నడూ చేయకూడదు
మహమ్మద్ యూనస్ ఇంటిపై దాడి, గ్రామీణ్ బ్యాంక్ బ్రాంచ్‌లూ దహనం
భారత్ కు సింధు జలాల ఒప్పందంపై “చేతులు నరికేస్తాం” అన్న పాక్ మంత్రి