యుపిలో హింసాత్మక ఆందోళనల్లో పాల్గొంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు

ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నైతిక ధృవీకరణ నిబంధనలను కఠినతరం చేసింది. దీనివల్ల ‘హింసాత్మక పాలన మార్పు’కు పిలుపునిచ్చిన వారితో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో ‘పాలన మార్పు’కు పిలుపునిచ్చారన్న ఆరోపణలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 
 
ఈ చర్యపై సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  హింసాత్మక పద్ధతుల ద్వారా అధికార మార్పిడికి లేదా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఆందోళనలు జరిపే వారికి, అలాంటి తీవ్రవాద ధోరణి కలిగిన సంస్థల్లో సభ్యులుగా ఉన్నవారికి ఇకపై యూపీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమని రవాణా, నియామకాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దేవరాజ్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. 
 
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ నూతన విధానం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థల్లో నేరుగా భర్తీ చేసే కొలువులకు వర్తిస్తుందని ప్రభుత్వం తన జీవోలో స్పష్టం చేసింది. నూతన నిబంధనల ప్రకారం 21 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత వెరిఫికేషన్ తేదీకి ముందు మూడేళ్ల వ్యవధిలో హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే వారిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా పరిగణిస్తారు.
 
అయితే కేవలం ఒక రాజకీయ భావజాలం కలిగి ఉన్నంత మాత్రాన ఎవరినీ అనర్హుడిగా ప్రకటించలేరని, కేవలం ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం లేదా పోలీసు విచారణ పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయలేరని వెసులుబాటు కల్పించారు. అలాగే కోర్టుల ద్వారా నిర్దోషిగా తేలిన వారు, రాజీ కుదిరిన కేసులు, జువైనల్ జస్టిస్ చట్టం కిందకు వచ్చే విషయాలకు ఈ అనర్హత నిబంధనలు వర్తించవుని చెప్పారు. 
 
అభ్యర్థుల నుంచి స్వయం ప్రతిపత్తి గల డిక్లరేషన్ పత్రాలు తీసుకుని ప్రాథమిక నియామక లేఖలు ఇవ్వవచ్చని, కానీ వెరిఫికేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే ఉద్యోగాన్ని వెంటనే రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ కొత్త వెరిఫికేషన్ మార్గదర్శకాలపై ఎస్పీ అధికార ప్రతినిధి ఉదయ్‌వీర్ స్పందిస్తూ ఈ తరహా కఠిన ఉత్తర్వులు బ్రిటీష్ నిరంకుశ పాలనను గుర్తు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. 
 
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైనదని, ఎన్నికల ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వం మారడం సాధారణ ప్రక్రియ అని పేర్కొన్నారు. భయానక వాతావరణాన్ని సృష్టించడానికే యోగి ప్రభుత్వం బ్రిటీష్ కాలం నాటి ఆలోచనా విధానంతో ఇలాంటి జీవోలను తీసుకొచ్చిందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ మాట్లాడుతూ కోర్టులు చేయాల్సిన పనిని ప్రభుత్వమే చేసుకుంటూ జడ్జిలా వ్యవహరిస్తోందని, జెన్-జీ యువత నిరసనలకు యోగి ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు.
 
పోలీస్ వ్యవస్థ, లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్  తమ వెరిఫికేషన్ నివేదికలను అభ్యర్థన అందిన 30 రోజుల్లోగా నియామక అథారిటీకి సమర్పించాలని గడువు విధించారు. అభ్యర్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదని, ఫిజికల్ అటెండెన్స్ నిర్బంధం కాదని తెలిపారు. ఒకవేళ ప్రతికూల నివేదిక వస్తే.. జిల్లా మెజిస్ట్రేట్ సదరు అభ్యర్థికి ఆన్‌లైన్ లేదా వ్యక్తిగతంగా తన వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వాలని నూతన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సేవల్లో ఉన్న ఉద్యోగులకు మళ్లీ ఈ క్యారెక్టర్ వెరిఫికేషన్ వర్తించదు.

About The Author