స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. ‘కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారుగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ కూటమిని గెలిపిస్తే ట్రిపుల్‌ ఇంజన్‌ స్పీడ్‌తో అభివృద్థి చేస్తాం. ఈ ఎన్నికల్లో కూటమికి మద్దతు పలికి ప్రజలు ట్రెండ్‌ సెట్‌ చేయాలి’ అని పిలుపిచ్చారు. 

ఒక వ్యక్తి వైఖరితో రాష్ట్రం ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. రప్పారప్పా రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెడతారా అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను నిలదీశారు. మంగళవారం కూటమి అగ్రనేతలు జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్‌లతో కలిసి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్‌ బెంగళూరు నుంచి వచ్చి హిట్‌ అండ్‌ రన్‌ తరహాలో వ్యవహరిస్తున్నారని.. రాష్ట్రంలో ఫేక్‌ ప్రచారం చేసి తిరిగి బెంగళూరు వెళ్లిపోతారని విమర్శించారు. 

గొడ్డలి పార్టీ నేతలు హింసా విధానాన్ని విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. స్థానిక ఎన్నికలు జరగడం గొడ్డలి పార్టీకి ఇష్టం లేదని, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగనివ్వకూడదనేది దాని ఆలోచన అని ఆరోపించారు. ఎన్నికలు ఆపడానికి కోర్టుల్లో 62 పిటిషన్లు దాఖలు చేశారని గుర్తుచేశారు. ‘సర్‌పైనా, డీలిమిటేషన్‌, బీసీ రిజర్వేషన్లపైనా కోర్టులకెక్కారు. ఇప్పుడు ఎన్నికలు జరక్కపోతే ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయి’ అంటూ ధ్వజమెత్తారు.

“2024లో చరిత్రాత్మక మద్దతు ఇచ్చినట్లు గానే మా రెండున్నరేళ్ల కష్టాన్ని గుర్తించి ఆశీర్వదించాలని కోరుతున్నాము.  స్థానిక సంస్థల్లో ప్రతి అంశాన్నీ బేరీజు వేసుకుని కూటమి సంకీర్ణ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకునే సీట్లు ఇచ్చాం. బీఫాం ఇచ్చిన అభ్యర్థులకే కూటమి నేతలు సహకరించాలి. వారినే గెలిపించాలి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించొద్దు” అని స్పష్టం చేశారు. 

“మూడు పార్టీలూ సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఇది. సీట్ల సర్దుబాటుపై తాను, పవన్‌ కల్యాణ్‌ ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం. ఎంపీటీసీల స్థాయిలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాం. రాష్ర్టాభివృద్థి కోసం కూటమిగా పని చేయడానికి ప్రాధాన్యమిస్తున్నాం. స్థానిక సంస్థల్లో సీట్లు ఇవ్వలేని వాళ్లకు న్యాయం చేస్తాం. కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించేందుకు మూడు పార్టీల కార్యకర్తలు కృషి చేయాలి” అని చంద్రబాబు పిలుపిచ్చారు.

“గొడ్డలి పార్టీ సిద్ధాంతం.. క్రిమినలైజేషన్‌, లిటిగేషన్‌, ఫేక్‌ ప్రాపగాండా. మా సిద్థాంతం.. సంక్షేమం, అభివృద్థి, సుపరిపాలన, సేవా భావం. గతంలో రాజకీయాల్లోకి రౌడీలు వస్తే ప్రజలు గమనించేవారు. ఇప్పుడు రౌడీలే రాజకీయం చేస్తున్నారు. గతంలో గుంతలు పెట్టిన రోడ్లను మరమ్మతు చేశాం. కొత్తవి వేస్తున్నాం. గతంలో నిలిచిపోయిన సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం” అని తెలిపారు. 

 

About The Author