నరసాపురానికి సమీపాన తీరంలోకి ప్రవేశించిన ‘అర్నబ్‌’ బీభ‌త్సం

యానాంకి దక్షిణంగా నరసాపురానికి సమీపాన అతి తీవ్ర తుపాను   ‘అర్నబ్‌’ తీరంలోకి ప్రవేశించింది.అర్ధరాత్రి యానాం-అంతర్వేది మధ్య తుఫాను తీరం దాటింది. తీర ప్రాంతం సావిత్రి నగర్ గ్రామంలోకి సముద్రం చొచ్చుకువచ్చింది. గ్రామంలో మూడు అడుగుల మేర నీటి ప్రవాహం కొనసాగింది. ఈ వేకువ జామున 2:30 నుంచి 3 గంటల సమయంలో నరసాపురం- యానాం సమీపంలో తీరాన్ని తాకిన తుఫాన్ తీవ్రత అంచనాలకు మించిన స్థాయిలో కనిపించింది. 

ఉత్తరాంధ్ర, కోస్తా తీరం మొత్తం అల్లకల్లోలమైంది. భారీగా కోతకు గురైంది. అనేక చోట్ల సముద్రం కొన్ని మీటర్ల పాటు ముందుకు చొచ్చుకొచ్చింది. నరసాపురానికి 30 కిలోమీటర్ల దూరంలోనే కేంద్రీకృతమయ్యిందని, అది మధ్యాహ్నానికి పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. కోస్తా జిల్లాలకు కంటి మీద కునుకులేకుండా చేసింది.  తుఫాను ప్రభావంతో సుమారు 20 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో యానాం అంతా అంధకారం అలుముకుంది. 

తుఫాను ధాటికి యానం ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విశాఖ-బాపట్ల మధ్య తుపాను అత్యంత తీవ్ర ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.  ఈ తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. తీరంలో అలలు 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడ్డాయి. 

ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మూడు గంటల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ తీరానికి సమీపించిన సమయంలో దాని వేగం మందగించింది. గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదిలింది.  దీని ధాటికి కాకినాడ జిల్లా చివురుటాకులా వణికిపోయింది. జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. 

కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గంటకు 125-135కిమీ వేగంతో ఈదురుగాలులు నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈదురుగాలుల తీవ్రత అధికంగా కనిపించింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఉక్కిరిబిక్కిరికి గురి చేశాయి. అనేక ప్రాంతాల్లో అంధకారం ఏర్పడింది. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

తీవ్ర తుపాను దృష్ట్యా ఇవాళ భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. కృష్ణా, ఎన్టీఆర్‌, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  

 

About The Author