స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో వైసీపీకి  ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ గడువును పెంచాలన్న వైసీపీ అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ ఎన్నికలపై వైసీపీ పిటిషన్‌‌పై విచారణను ముగించింది.  అయితే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను రోజువారీగా పర్యవేక్షించాలని హైకోర్టుకు ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.  సుప్రీంకోర్టులో మంగళవారం  మున్సిపల్ ఎన్నికలపై కీలక విచారణ జరుపుతూ ఎన్నికల ప్రక్రియను సీసీ కెమేరాలతో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ల పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కీలక మార్గినిర్దేశం చేసింది. నామినేషన్ల వివాదాలపై ఎన్నికల పిటిషన్లకు వెళ్లాలని సూచించింది.  అదే విధంగా ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇంకా 53 శాతం మంది అభ్యర్ధులు నామినేషన్లు వేసే అవకాశం ఇవ్వలేదని మరోసారి వైసీపీ సుప్రీంకోర్టుకు నివేదించింది.
కోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ల గడువు పొడిగించామని, ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ తరపు న్యాయ వాదులు వివరించారు.  గత విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సమర్పించాయి. కాగా, ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో జరగటం లేదని వైసీపీ తరపు న్యాయవాదులు కోర్టుకు ఫిర్యాదు చేసారు.
తమ పార్టీ అభ్యర్థులను పలుచోట్ల నామినేషన్లు వేయనీకుండా అడ్డుకున్నారని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  ఎక్కడ ఫిర్యాదులు వచ్చాయో అక్కడ పరిశీలన చేసి చెప్పమన్న సంగతిని విచారణ వేళ కోర్టు గుర్తు చేసింది. నామినేషన్ దాఖలు చేసేందుకు తమను అడ్డుకున్నారని భావించే అభ్యర్థులు, తమ వాదనకు తగిన ఆధారాలు ఉంటే చట్టప్రకారం ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. 

About The Author