తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల సదస్సుకు ప్రధాని మోదీ, అమిత్ షా 

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఆర్)లో డిసెంబర్ 4 నుండి 6 వరకు డీజీపీలు , ఐజీపీల జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. ఈ  కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు. వారిద్దరి తిరుపతి పర్యటన ఖరారైనట్లు రాష్ట్ర ప్రభుత్వంకు సమాచారం అందినట్లు చెబుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్  ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక ఆదేశాలు ఇచ్చారు.
 
 వీరితో పాటు ఇతర ప్రముఖులు కూడా ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు, సచివాలయంలో ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో అంతర్-శాఖ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని, ఏయే శాఖలు ఏయే బాధ్యతలు చేపట్టాలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. 
 
సంబంధిత శాఖల కార్యదర్శులు, ఇతర అధికారులు ఇప్పటి నుండే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ సదస్సుకు మోదీ, అమిత్ షాలతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, ఐజీపీలతో సహా 200 మందికి పైగా ఐపీఎస్ అధికారులు, సుమారు 200 మంది ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, రాష్ట్ర, కేంద్ర భద్రతా దళాల ప్రతినిధులు, జాతీయ భద్రతా సలహాదారు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు వస్తున్నట్లు సీఎస్ తెలిపారు. 
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో మొదటి రెండు రోజులు పాల్గొనే అవకాశం ఉన్నందున, విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరుపతి నగరాన్ని సుందరీకరించడంతో పాటు ఇతర అవసరమైన ఏర్పాట్లను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచించారు. అలాగే, సదస్సు జరిగే ప్రదేశంలో ఎటువంటి అంతరాయం లేని కనెక్టివిటీ కోసం ప్రత్యేక నెట్‌వర్క్ టవర్‌ను ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ అధికారులను ఆదేశించారు. 

About The Author