కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ తపబ్రత చక్రవర్తిని తెలంగాణ హైకోర్టుకు నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ శ్యాంకోశీని పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలీజియం నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించేందుకు పేర్లను ఖరారు చేసింది. తెలంగాణ, ఢిల్లీ హైకోర్టులతోపాటు గుజరాత్, ఉత్తరాఖండ్ హైకోర్టులకు కూడా కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని కొలీజియం నిర్ణయించింది.
గుజరాత్ హైకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మానస్ రంజన్ పాఠక్‌ను అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది.
పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ సింగ్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదించింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి, అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత సంబంధిత న్యాయమూర్తులు కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో పనిచేసిన జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్ ఈ నెల 6న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
దీంతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానం ఖాళీ అయింది. అప్పటి నుంచి జస్టిస్ శ్యాంకోశీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో శాశ్వత ప్రధాన న్యాయమూర్తిని నియమించేందుకు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కలకత్తా హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్ తపబ్రత చక్రవర్తికి ఈ బాధ్యతలు అప్పగించాలని సిఫార్సు చేసింది. జస్టిస్ తపబ్రత చక్రవర్తి 1966 నవంబరు 27న పశ్చిమబెంగాల్లో జన్మించారు.
1991 జనవరి 29న కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని న్యాయవృత్తిని ప్రారంభించారు. సుమారు 22 ఏళ్లపాటు సివిల్, రాజ్యాంగ, సర్వీసు, విద్యాచట్టాలకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించారు. ముఖ్యంగా రాజ్యాంగపరమైన అంశాలపై కేసుల వాదనలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవం గడించిన అనంతరం 2013 అక్టోబరు 30న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2016 మార్చి 14న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2026 జూన్ 21 నుంచి కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.

More Stories
తుమ్మిడిహెట్టి బ్యారేజీకి మహారాష్ట్ర సానుకూలత
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
నవంబర్ 2న ‘లోక్తంత్ర బచావో – అరాచకత హఠావో’ భారీ పాదయాత్ర