తెలంగాణలో సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యలను పరిష్కరించి, నిర్మాణానికి మార్గం సుగమం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కీలక చర్చలు జరిపింది.
ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ నీటి అవసరాలు, వెనుకబడిన ప్రాంత అభివృద్ధి, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రను కోరారు.
తమ రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం లేకపోతే తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి గతంలో కుదిరిన ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ నీటి అవసరాలకు సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. కేంద్ర జలసంఘం అధ్యయనంతో పాటు రెండు రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీ అన్ని అంశాలను పరిశీలించాలని ప్రతిపాదించారు. ముంపు, ప్రభావిత ప్రాంతానికి సంబంధించి ప్రత్యామ్నాయాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు.
ప్రాణహిత నదిపై తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, పరిహారం, ఇతర సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. తుమ్మిడిహెట్టి ఆనకట్ట ఎత్తు పెంపు అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో చర్చలు చాలా ఫలవంతంగా ముగిశాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి తమ ప్రతిపాదనను పెద్ద హృదయంతో పరిశీలించారని ఫడణవీస్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
సాంకేతిక అంశాలతో పాటు ముంపు అంశాలపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేసేందుకు ఇరువైపులా అంగీకారం కుదిరిందని తెలిపారు. మహారాష్ట్ర, అక్కడి ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటూనే జాతీయ ధృక్పథంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి గిరిజనుల జీవితాలను మార్చేందుకు తన వంతు సహకరిస్తానని ఫడణవీస్ హామీ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారని తెలిపారు.
సమావేశం ప్రారంభంలో ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రస్తావించిన ఆయన సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఆర్థిక అవకాశాలు లేకపోవడం, వెనుకబాటుతనం కారణంగా గతంలో నక్సలిజం వంటి సమస్యలు తలెత్తిన పరిస్థితులను పేర్కొన్నారు.
ఆదిలాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, ఎస్బీ చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి వివిధ దశల్లో ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. ఐదు దశాబ్దాలుగా అనేక ప్రతిపాదనలు, చర్చలు జరిగినప్పటికీ ఆశించిన పురోగతి లేదని తెలిపారు. 2016లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందన్న ఆయన ఆ ఎత్తుతో నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని వివరించారు.
ప్రస్తుత విద్యుత్ అవసరాలు, పంపింగ్ వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకుంటే నీటిని గ్రావిటీ ద్వారా తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచి నిర్మించడం తెలంగాణకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ప్రతిపాదించారు. ఈ ఎత్తు వల్ల కలిగే సాంకేతిక, ఆర్థిక ప్రయోజనాలను వివరించడంతో పాటు మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో అమల్లో ఉన్న భూసేకరణ నిబంధనలు, పరిహార విధానం ప్రకారమే బాధిత రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుందని రేవంత్ రెడ్డి వివరించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని కేవలం నీటిపారుదల ప్రాజెక్టుగా కాకుండా రెండు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడే వారధిగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, బ్యారేజీ ఎత్తు పెంపునకు తుది ఆమోదం లభించాల్సి ఉంది. ఈ చర్చలు ఫలప్రదమైతే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ముందుకు సాగేందుకు మార్గం సుగమమవుతుందని, తద్వారా ఆదిలాబాద్ ప్రాంతంలో సాగునీటి విస్తరణకు, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది.
More Stories
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఖర్గే క్షమాపణలు చెప్పాలని బిజెపి దేశవ్యాప్తంగా నిరసనలు
నవంబర్ 2న ‘లోక్తంత్ర బచావో – అరాచకత హఠావో’ భారీ పాదయాత్ర