హైదరాబాద్లో దుర్గాదేవి విగ్రహ ఊరేగింపుపై గుడ్డు విసిరారనే ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనలో ఉన్న ప్రజలను శాంతింపజేసి, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పాత నగరంలోని మదన్నపేట ప్రాంతంలో శనివారం రాత్రి దుర్గాదేవి విగ్రహ ఊరేగింపు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
అర్ధరాత్రి హిందూ సంఘాలు నిరసన చేపట్టడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు. వీర్ సావర్కర్ నవ యువ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఊరేగింపు సంతోష్ హోటల్ ప్రాంతం గుండా వెళుతుండగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దానిపై గుడ్లు విసిరారని ఆరోపణలు వచ్చాయి. దీంతో హిందూ సంఘాల సభ్యులు, బీజేపీ నాయకులు నిరసన చేపట్టి, ధర్నా చేసి భజనలు ఆలపించారు. తమ మత మనోభావాలను అవమానించినందుకు నిందితులను గుర్తించి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఫోన్ కాల్ ద్వారా ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న మాదన్నపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అనుమానితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రతో ఇటీవల కొన్ని ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. వినాయక నవరాత్రుల సమయంలో అన్నదానం ప్రాంతంలో కొందరు మహిళలు చేపల వ్యర్థాలు పారబోయగా, అంతకు ముందు దిల్షుఖ్నగర్ సంతోషి మాత ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి విగ్రహంపై కర్రతో దాడికి యత్నించాడు.
మాదన్నపేట ప్రాంతంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నదానం నిర్వహిస్తుండగా ఆ ప్రాంతంలో ఎముకలు, మాంసాహారం వ్యర్థాలతో ఉన్న కవర్ను పై నుంచి విసిరేశారు. దీంతో హిందూ సంఘాల నేతలు నిరసన చేపట్టారు. తాజాగా శనివారం రాత్రి అదే మాదన్నపేట ప్రాంతంలో దుర్గా మాత విగ్రహం ఊరేగింపు జరుగుతుండగా ఊరేగింపుపైకి కోడి గుడ్డు విసిరేశారనే ఆరోపణలు వచ్చాయి.
అర్ధరాత్రి 2 గంటల సమయంలో దుర్గా మాత ఊరేగింపుపై కోడి గుడ్డు విసిరినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే చార్మినార్ డీఎస్పీ కిరణ్ ఖరే, అడిషనల్ డీసీపీ మజిద్, ఏసీపీ శ్యామ్ సుందర్, సైదాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి, మాదన్నపేట ఎస్హెచ్వో కె.చంద్రశేఖర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దడం కోసం అక్కడున్న వారితో మాట్లాడిన అధికారులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరికైనా ఈ ఘటనలో ప్రమేయం ఉందేమోనని తెలుసుకోవడం కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

More Stories
పాలమూరు రైతాంగం గొంతు నులిమేలా డిండి లిఫ్ట్ కుట్రలు
35 శాతం వరకు పెరిగిన సన్న బియ్యం ధరలు
సాగు నీరు, తాగు నీరు, విద్యుత్ లపై చేతులెత్తేసిన రేవంత్