జవహర్ నగర్ డంప్ యార్డ్ తరలింపు కోసం రాజీలేని పోరాటం

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా నరకయాతన అనుభవిస్తున్న లక్షలాది మంది ప్రజల సమస్యను పరిష్కరించే వరకు రాజీపడే ప్రసక్తే లేదని, రేపటి నుంచే బాధిత ప్రజలతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నామని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు అంశంపై ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ  తెలంగాణ మొత్తం ఆదాయంలో 70 శాతం ఆదాయం వచ్చేది ఈ ప్రాంతం నుంచేనని గుర్తు చేశారు.
 
“అలాంటి నగరంలో ఇయ్యాల లక్షల మంది ప్రజలు కాలుష్యంతో బతుకు ఈడుస్తా ఉన్నారు. దీనికి పరిష్కారం కావాలని చెప్పి నేను పార్లమెంట్‌లో మాట్లాడినా. పార్లమెంట్‌లో మాట్లాడడమే కాకుండా కేంద్ర మంత్రి  మనోహర్ లాల్ ఖట్టర్ దగ్గరికి కూడా పోయి చెప్పినా. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్న ఈ కాలంలో జవహర్ నగర్ కంపునకు శాశ్వత పరిష్కారం చూపాలంటే సమగ్రమైన ప్రణాళికలతో రండి అని చెప్పి, నన్ను ఢిల్లీలో ఎట్లా చేస్తున్నారో చూసి రమ్మన్నారు” అని తెలిపారు. 
 
“ఢిల్లీకి పోయి కోట్ల కొద్దీ టన్నుల వేస్ట్‌ను వాళ్లు జీరో ఎట్లా చేస్తున్నారో చూసినం. కానీ వాళ్లు స్పష్టంగా ఒక మాట చెప్పిండ్రు. చెత్తను జీరో చేస్తున్నాం కానీ, గత 10-20 ఏండ్ల నుంచి అక్కడ ఏ భూగర్భ జలాలైతే పాయిజన్ అయినాయో వాటిని పూర్తిగా శుద్ధి చేయాలంటే చాలా సమయం పడుతుందని చెప్పిండ్రు. ఇవాళ జవహర్ నగర్‌లో ఉన్న రెండు మూడు కోట్ల టన్నుల చెత్తను రాత్రికి రాత్రే తీసేసినా వెంటనే లక్ష్మీ నారాయణ చెరువో, చీరాల చెరువో బాగుపడవు, దానికి టైం పడుతుంది” అని వివరించారు. అందుకే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ “జవహర్ నగర్ డంప్ యార్డ్‌ను నడపడంలో గత ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ వాడలేకపోయింది. సరైన నియంత్రణ లేకుండా పోయి అంత నష్టం జరిగిపోయింది. ఇవాళ సైన్స్ ఎంతో ఎదిగింది. ఇప్పుడు పెట్టే డంప్ యార్డుల్లో ఒక్క కిలో చెత్త కూడా వేస్ట్ కాకుండా ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఆర్గానిక్ మాన్యువల్ తయారు చేసుకోవచ్చు. ఒకనాడు ఊళ్లల్లో పెంటబంద ఎంత విలువైనదో మనకు తెలుసు” అని తెలిపారు. 

 
ఇవాళ చికెన్ వేస్ట్‌లో కూడా ఒక్క గ్రాము వృథా కాకుండా ఆదాయం తెచ్చుకునే పద్ధతులు వచ్చినప్పుడు ఇంత పెద్ద మహానగరంలో చెత్తను ప్రాసెస్ చేయడం ఎందుకు చేతకావడం లేదు? అని ఈటల ప్రశ్నించారు. చెత్త సేకరణలో జరుగుతున్న దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “ఇవాళ రాంకీ సంస్థ ఈ చెత్త విషయంలో గుత్తాధిపత్యం చలాయిస్తూ, చెత్త ఏరుకునే వాళ్ళు రానివ్వకుండా వెళ్లగొడుతోంది. వేలాది మంది చదువుకున్న నిరుద్యోగులు బతుకుదెరువు లేక సొంతంగా ఆటోలు కొనుక్కుని, ఇండ్లల్లో నెలకు రూ.100, రూ.150 తీసుకుని చెత్తను కలెక్షన్ చేసుకొని సెగ్రిగేట్ చేస్తుంటే దాని మీద కూడా కన్ను పడ్డది” అంటూ మండిపడ్డారు.
 
ఆటో కార్మికులపై బౌన్సర్లను పెట్టి కొట్టిస్తున్నారు అంటే చెత్త చుట్టూ ఎంత పెద్ద మాఫియా నడుస్తోందో అర్థమవుతోందని ఆయన చెప్పారు. డంపింగ్ యార్డ్ వల్ల ఏర్పడే కాలుష్యాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడి నుంచి వెలువడే మిథేన్ గ్యాస్ దాదాపు 12 లక్షల కార్లు రోడ్లపైకి వస్తే ఎంత పొల్యూషన్, ఎంత వేడి బయటకు వస్తుందో అంత కాలుష్యంతో సమానమని లెక్కలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

“రేవంత్ రెడ్డి గారూ.. మీరు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు చూసిన, చెప్పిన పనులను ఇప్పుడు ముఖ్యమంత్రిగా అమలు చేయండి. ఇక్కడ రాజకీయాలు చేయకండి. మొన్న జూన్‌లో కూడా నేను చెప్పిన.. కేసీఆర్ మీద కోపం ఉంటే ఉండని, కానీ కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయండి అని. కేసీఆర్‌ను బోనులో నిలబెట్టే క్రమంలో తెలంగాణ రైతాంగాన్ని బోనులో నిలబెట్టకండి” అంటూ విమర్శించారు. 


ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, పర్యావరణవేత్తలు దొంతి నరసింహ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎన్ఎఫ్సీ మాజీ డిజిఎం హనుమంత రెడ్డి, ఎన్‌ఎఫ్‌సీ రిటైర్డ్ అధికారి పురుషోత్తం రెడ్డి తదితరులు ప్రసంగించారు.  

 

About The Author