మైనారిటీ హక్కులపై ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ సవాల్

 
మతపరమైన మైనారిటీల పట్ల పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరుపై ఐక్యరాజ్యసమితిలో భారత్ తీవ్రంగా విమర్శించింది. మత స్వేచ్ఛ, అంత్యక్రియల హక్కులు, మైనారిటీల పట్ల వ్యవహరించే తీరుపై న్యూఢిల్లీకి నీతులు చెప్పే ప్రయత్నంలో, బలహీన వర్గాలను రక్షించడంలో ఇస్లామాబాద్ విఫలమైందని ఆరోపించింది. 
 
అసాధారణ పరిస్థితులలో అంత్యక్రియల హక్కులపై మత స్వేచ్ఛ లేదా విశ్వాసంపై ప్రత్యేక ప్రతినిధితో జరిగిన ఒక సంభాషణలో భారత్ తరపున ప్రకటన చేస్తూ, ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి భావికా మంగళానందన్, కరోనా మహమ్మారి సమయంలో మత వివక్ష పట్ల నివేదిక వైఖరిని, ఉగ్రవాదుల అంత్యక్రియల హక్కులకు అది మద్దతు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. 
 
మహమ్మారి సమయంలో జరిగిన వివక్షాపూరిత పద్ధతులు, లోపాలను ప్రధానంగా గ్లోబల్ సౌత్ దేశాలకు ఆపాదిస్తూ, అభివృద్ధి చెందిన దేశాలలో జరిగిన ఇలాంటి విషాదాలను నివేదిక విస్మరిస్తున్నట్లు కనిపిస్తోందని మంగళానందన్ విమర్శించారు. “నివేదిక ప్రకారం, కరోనా సమయంలో జరిగిన వివక్ష, తప్పుడు పద్ధతులన్నీ కేవలం గ్లోబల్ సౌత్‌లోనే జరిగాయని చెబుతున్నారు. అభివృద్ధి చెందిన ప్రపంచంలో ఇలాంటి విషాదకరమైన పరిస్థితులను ప్రస్తావించకపోవడం వల్ల ఒక నివేదికకు ఏ ప్రయోజనం ఉంటుంది?” అని ఆమె ప్రశ్నించారు. 
 
మానవ బాధలను రాజకీయం చేయవద్దని ఆమె హెచ్చరించారు. మత స్వేచ్ఛపై నివేదికలు రాజకీయ ప్రయోజనాల కోసం సంఘటనలను ఎంపిక చేసి మాత్రమే చూపించడం కాకుండా, ఉల్లంఘనలను నిష్పక్షపాతంగా ప్రస్తావించాలని ఆమె హితవు చెప్పారు. “ప్రజల బాధ, నష్టం నుంచి రాజకీయ లబ్ధి పొందడం అనేది ప్రత్యేక నివేదికలు (తమ ప్రాముఖ్యతను నిర్ధారించుకోవడానికి ఆధారంగా చేసుకోకూడదు,” అని మంగళానందన్ పేర్కొన్నారు. 
 
ఉగ్రవాదుల అంత్యక్రియల హక్కులపై నివేదిక వైఖరిని ప్రశ్నిస్తూ, ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల హక్కులను, నేరస్థుల హక్కులు కప్పివేయకూడదని ఆ భారత దౌత్యవేత్త వాదించారు. “ఒక ఉగ్రవాది అమాయక ప్రజలను చంపడమే కాకుండా, ఒక దేశ మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాడు. మానవుల అత్యంత పవిత్రమైన హక్కు అయిన జీవించే హక్కును ఉల్లంఘించే ఉగ్రవాదుల హక్కుల కోసం చేసే తీవ్రమైన వాదన, ఉగ్రవాద బాధితులకు అదే విధంగా వర్తించకపోవడం విచారకరం,” అని ఆమె చెప్పారు. 
 
1999 కార్గిల్ సంఘర్షణ సమయంలో పాకిస్తాన్ రికార్డును లక్ష్యంగా చేసుకుని,  “1999లో కార్గిల్ యుద్ధంలో మరణించిన తమ సొంత సైనికుల మృతదేహాలను కూడా స్వీకరించని ఒక దేశం, ఇప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా విశ్వాసం, మత స్వేచ్ఛ, అంత్యక్రియల గురించి ఉద్వేగంతో మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది” అని ఆమె ఎద్దేవా చేశారు.

About The Author