శిక్ష పూర్తయినా బంగ్లాదేశ్ జైళ్లలోనే 168 మంది భారతీయులు

బంగ్లాదేశ్ జైళ్లలో శిక్షాకాలం పూర్తయినా స్వదేశానికి తిరిగి వెళ్లలేక 168 మంది భారతీయులు ఇంకా నిర్బంధంలో ఉన్నట్లు ‘ది డైలీ స్టార్’ నివేదిక వెల్లడించింది. అయితే, స్వదేశానికి పంపాల్సిన భారతీయ ఖైదీలు 25 మంది మాత్రమేనని ఢాకాలోని భారత హైకమిషన్ తెలిపింది. మిగిలినవారి జాతీయతను నిర్ధారించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. 
 
బంగ్లాదేశ్ జైళ్లలో 15 దేశాలకు చెందిన 407 మంది విదేశీ ఖైదీలు ఉన్నారు. మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, బంగారం స్మగ్లింగ్, అక్రమంగా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) సేవలు నిర్వహించడం వంటి నేరాలకు సంబంధించి వీరు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో సగానికి పైగా భారతీయులేనని ‘ది డైలీ స్టార్’ పత్రిక శుక్రవారం వెల్లడించింది.బంగ్లాదేశ్ జైళ్లలో 238 మంది భారతీయ ఖైదీలు ఉండగా, వారిలో 168 మంది శిక్షాకాలం పూర్తయినప్పటికీ స్వదేశానికి పంపే ప్రక్రియ పూర్తికాక నిర్బంధంలోనే ఉన్నారని ఆ పత్రిక పేర్కొంది. 
 
అయితే, శిక్ష పూర్తయి స్వదేశానికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న భారతీయ ఖైదీలు 25 మందేనని భారత హైకమిషన్ కాన్సులర్ విభాగం అధికారి తెలిపారు. ఖైదీల జాతీయతను నిర్ధారించడంలో ఎదురవుతున్న ఇబ్బందులే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. శిక్ష పూర్తయిన 121 మంది భారతీయ ఖైదీల జాబితాను బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తమకు అందించిందని హైకమిషన్ అధికారి వెల్లడించారు. అయితే, వారిలో చాలామందిని భారతీయులుగా గుర్తించేందుకు అవసరమైన వ్యక్తిగత వివరాలు సరిపోవడం లేదని చెప్పారు.
 
ఆయా ఖైదీలను కలిసేందుకు అనుమతి కోరామని, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. కొందరి విషయంలో జాతీయత నిర్ధారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని వివరించారు. ఈ ఏడాది జూన్‌లో పీటీఐ ప్రచురించిన కథనం ప్రకారం, ఆరు నెలల క్రితం విడుదలైన జైళ్ల గణాంకాల్లో శిక్ష పూర్తయి స్వదేశానికి వెళ్లాల్సిన 152 మంది విదేశీ ఖైదీల్లో 148 మంది భారతీయులే ఉన్నారు. 
 
గుర్తింపు ప్రక్రియలో జాప్యం, అధికారిక విధానాలు, దౌత్యపరమైన నిర్లక్ష్యం కారణంగా వారి నిర్బంధం కొనసాగుతోందని అప్పట్లో ఓ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్ జైళ్లలో మయన్మార్‌కు చెందిన 133 మంది ఖైదీలు ఉండగా, వారిలో ఒక్కరు మాత్రమే శిక్ష పూర్తిచేసుకుని స్వదేశానికి వెళ్లాల్సి ఉందని ‘ది డైలీ స్టార్’ పేర్కొంది. ఇతర విదేశీ ఖైదీల్లో ఆరుగురు నైజీరియన్లు, పాకిస్థాన్, మలేసియా పౌరులు ముగ్గురేసి ఉన్నారు. 

About The Author