భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే డిసెంబర్ 11, 12 తేదీల్లో ఆయన కెనడాలో పర్యటిస్తారని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కెనడా (ఒట్టావా)లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం దీనిపై ప్రకటన చేసింది. ప్రధాని పర్యటన ఖరారైందని తెలిపింది. మోదీ తన పర్యటనలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రెండు దేశాధినేతలు అంగీకరించారని భారత్ తెలిపింది. మోదీ పర్యటన ద్వైపాక్షికంగా కీలక మలుపుగా అభివర్ణించింది. ఈ పర్యటనలో వ్యాపారం, వాణిజ్యం, ఎనర్జీ, టెక్నాలజీ, భద్రతతోపాటు పౌరుల సేవలు వంటి అంశాలపై మోదీ, కార్నీ చర్చిస్తారు. మోదీ పర్యటన గురించి కార్నీ కూడా ఇటీవల వెల్లడించారు.
గురువారం ఆయన ఒక రెస్టారెంట్లో అక్కడి ప్రజలతో మాట్లాడుతూ మోదీ పర్యటనను ఖాయం చేశారు. అమెరికాకు పొరుగునే ఉన్న కెనడా – ఇండియా వ్యాపారాలకు, ఇతర ద్వైపాక్షిక సంబంధాలకు చాలా కీలకం. ప్రస్తుతం అమెరికాతో వ్యాపారం, వాణిజ్యం విషయంలో ఇండియా పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు, వాణిజ్య ఒప్పందం విషయంలో ఇంకా తుది నిర్ణయం ఖరారు కాకపోవడం ఇబ్బందిగా మారింది.
ఇలాంటి తరుణంలో మోదీ కెనడాలో పర్యటించడం ఇండియాకు చాలా మేలు చేస్తుందనేది విశ్లేషకుల మాట. మరోవైపు, కెనడా-ఇండియా మధ్య కూడా త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది.
రెండు దేశాల మధ్య 2030 నాటికి 70 బిలియన్ అమెరికన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరగాలన్నది తమ లక్ష్యమని కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్ధు ఇటీవల వెల్లడించారు. మోదీ తన పర్యటన ఖరారు కావడానికి ముందు కెనడా ప్రధాని మార్క్ కార్నీతో గత మంగళవారం ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం, వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపు కోసం చర్చలు జరిపామని మోదీ తెలిపారు.
కార్నీ కార్యాలయం నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’ (సిఈపిఎ )పై చర్చలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు. ఇది 2030 నాటికి ఉభయ దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసే ప్రయత్నాలకు తోడ్పడుతుంది.

More Stories
రైఫిల్ జామ్ కావడంతో అమెరికా గుడిలో తప్పిన కాల్పులు!
ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం
బ్రిటన్లోనూ భారతీయ విద్యార్థుల అడ్మిషన్లకు కత్తెర!