హిందూ ఆలయాలపై కాల్పులకు ఓ అమెరికా యువకుడు కుట్ర!

* ఆయుధాలు, నాజీ చిహ్నాలు లభ్యం 
 
ఇల్లినాయిస్‌లోని అరోరా నగరంలో ఒక హిందూ దేవాలయంలో సామూహిక కాల్పులకు కుట్ర పన్నిన ఆరోపణలపై, తనను తాను “సామాజిక విరోధి, శ్వేతజాతి ఆధిపత్యవాది, నయా నాజీ”గా అభివర్ణించుకునే 19 ఏళ్ల అమెరికా యువకుడిని చికాగోలో అరెస్టు చేశారు. పోలీసులు అతని వద్ద నుండి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, జాతి దూషణలు, నాజీయిజం చిత్రాలు ఉన్న అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇల్లినాయిస్‌లోని పాలటైన్‌కు చెందిన టాకో బెల్ క్యాషియర్ అయిన అలెగ్జాండ్రోస్ పాపరాకిస్‌పై తీవ్రవాద బెదిరింపులకు పాల్పడటం, చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉండటం వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. అరోరాలోని అతిపెద్ద హిందూ దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని లక్ష్యంగా చేసుకోవాలని అతను ప్రణాళిక వేసి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే కచ్చితంగా లక్ష్యంగా చేసుకున్న ప్రదేశంపై దర్యాప్తు కొనసాగుతోంది. 
 
కుక్ కౌంటీ స్టేట్ అటార్నీ కార్యాలయానికి చెందిన ప్రాసిక్యూటర్ల ప్రకారం, పాపరాకిస్ సహోద్యోగులు ఆందోళన కలిగించే డిజిటల్ సమాచారాన్ని అందుకున్న తర్వాత అధికారులను అప్రమత్తం చేశారు. అందులో సామూహిక కాల్పుల ప్రణాళికను వివరించే ఒక పత్రం, వ్యూహాత్మక పరికరాల ఫోటోలు ఉన్నాయి . పాపారాకిస్ పని చేసే చోట బహిరంగంగా తనను తాను శ్వేతజాతి ఆధిపత్యవాదిగా ప్రకటించుకున్నాడని, భారతీయ ప్రజలను చంపడానికి తాను ఆగలేనని చెప్పాడని అతని సహోద్యోగులు పోలీసులకు తెలిపారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 
 
ఆదివారం మధ్యాహ్నం పాపారాకిస్ తన ఇంటి నుండి బయలుదేరుతుండగా, అతడిని గుర్తించి అరెస్టు చేయడానికి మౌంట్ ప్రాస్పెక్ట్, పాలటైన్ పోలీస్ విభాగాలు సమన్వయం చేసుకున్నాయి. ఆ రోజు అతను ఒక దాడికి సిద్ధమవుతూ ఉండవచ్చని డిటెక్టివ్‌లు భావిస్తున్నారు. పోలీసుల ప్రకారం, పాపారాకిస్ తన టాకో బెల్ సహోద్యోగులతో ఆదివారం “ఒక ప్రత్యేకమైన రోజు” కాబోతోందని చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
ఆ రోజు అంతకుముందే అతను ఒక సహోద్యోగికి ఫోన్ చేసి, తన తుపాకీ జామ్ అయిందని, ఎవరికీ కనపడకుండా “చాలా వేగంగా” వెళ్లిపోయానని చెప్పినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. భారతదేశం, యూదు, ఆఫ్రో-అమెరికన్ వర్గాలపై దాడి చేయడానికి పన్నిన కుట్రను వివరించే మ్యానిఫెస్టో పాపారాకిస్ ఒక సహోద్యోగికి “నేను ఎందుకు పోరాడాను: దీనినే (అరోరా షూటర్ మ్యానిఫెస్టో) అని కూడా పిలుస్తారు” అనే శీర్షికతో ఉన్న ఎనిమిది పేజీల పత్రాన్ని పంపినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. 
 
అసోసియేటెడ్ ప్రెస్ కు లభించిన ఒక కోర్టు పత్రం ప్రకారం, ఆ పత్రంలో భారతీయ, యూదు, ఆఫ్రికన్ అమెరికన్ ప్రజలను “నీచ మానవులు”గా వర్ణించడంతో పాటు, వారిలో వీలైనంత ఎక్కువ మందిని చంపడానికి పన్నిన ఒక కుట్రను కూడా వివరించారు. ఆ ప్రకటనలో, పాపరాకిస్ తనను తాను “ద్వేషంతో నిండిన, దాదాపు ప్రతిరోజూ సామూహిక హత్యల గురించి కలలు కనే ఒక సమాజ వ్యతిరేక శ్వేతజాతి ఆధిపత్యవాది, నయా నాజీ”గా అభివర్ణించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
పోలీసులు, ప్రాసిక్యూటర్ల ప్రకారం, పాపరాకిస్ ఇంటిని సోదా చేయగా, సీరియల్ నంబర్ లేని ఒక ఏఆర్-శైలి రైఫిల్, లోడ్ చేసిన మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రిని డిటెక్టివ్‌లు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాసియా వారిని లక్ష్యంగా చేసుకుని దూషణలు రాసి ఉన్న ఒక గ్యాస్ క్యాన్‌స్టర్‌తో పాటు, నాజీ చిహ్నాలను కలిగి ఉన్న అనేక వస్తువులను కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 
“ఈ ఆరోపిత ముప్పు తీవ్రతను ఎంత చెప్పినా తక్కువే,” అని పాలటైన్ పోలీస్ చీఫ్ విలియం నార్డ్ పేర్కొన్నారు. ప్రార్థనా స్థలాలను పరిరక్షించడం చట్ట అమలు సంస్థలకు ప్రాధాన్యతగా ఉంటుందని ఆయన తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు పాపరాకిస్ జైలులోనే ఉండాలని బుధవారం ఒక న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అతను అక్టోబర్ 30న మళ్లీ కోర్టులో హాజరు కావాల్సి ఉంది.

 

 
 

About The Author