ఆసియా క్రీడలలో విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు 

ఇటీవల ఆసియా క్రీడల్లో పతకాలతో మెరిసిన భారత బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. దేశం గర్వపడే ప్రదర్శన చేసిన క్రీడాకారులతో గురువారం భేటీ అయిన ప్రధాని ‘మీరు 140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశార’ని కొనియాడారు. ఆసియాడ్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన అథ్లెట్లు, క్రికెట్ టీమ్‌లను ప్రధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో సన్మానించారు. ఈ సందర్భంగా భారత బృందం సతకాలు చేసిన జెర్సీని మోదీకి బహూకరించింది.

గత ఎడిషన్‌లో మాదిరిగా ఈసారి సెంచరీ కొట్టకున్నా సరే దేశ ప్రజలంతా గర్వపడే ప్రదర్శన చేసినందుకు వారిని మోదీ అభినందించారు.  గత 12 ఏళ్లలో కృషితో దేశంలో పారదర్శకమైన క్రీడావ్యవస్థను తీసుకువచ్చామని చెప్పారు. 2 బంగారు పతకాలు సాధించిన ఆర్చరీ సంచలనం కుంకుమ్ మొహోద్ తన విల్లును ప్రధానికి బహూకరించారు.  ఆసియా క్రీడల్లో హాకీ గేమ్లో పురుష, మహిళల జట్లు రెండూ బంగారు పతకాలు సాధించటంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా మహిళల హాకీ జట్టు ఏకంగా 44ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్వర్ణం సాధించటం చరిత్రాత్మకమని కొనియాడారు. దేశ యువత ప్రతి శిఖరాన్ని చేరుకోవటానికి ఎంతగా ఆరాటపడుతున్నారో చెప్పడానికి ఇదో నిదర్శనమని తెలిపారు. “మీరు 140 కోట్ల భారతీయులు గర్వపడేలా చేశారు. పోడియం మీద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేయడం మీరు సాధించిన పెద్ద విజయం. అందుకే ఈ విజయం మీది మాత్రమే కాదు దేశంలోని కోట్లాది మందికి చెందుతుంది” అని చెప్పారు.

“దేశ ప్రజలందరి తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నా. 18వ ఆసియాడ్‌లో గెలుపొందిన 85 పతకాల్లో  38 మహిళా అథ్లెట్లు సాధించినవే. వీటిలో పదకొండు స్వర్ణాలు ఉండడం భారత్‌కు చాలా ప్రత్యేం. అద్భుత ప్రదర్శన చేసిన మహిళా అథ్లెట్లకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడ హాకీ జట్లు రెండు ఉన్నాయి. హాకీలో పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు పట్టేశాయి” అంటూ ప్రశంసించారు.

“భారతదేశం కేవలం క్రీడల్లో అద్భుతంగా రాణించడం మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఒకప్పుడు అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్​ చాలా తక్కువ పతకాలు సాధించేది. అన్ని క్రీడలపై అవగాహన ఉండేది కాదు. ఆ నిరాశను దూరం చేయడం వల్లే ఇప్పుడు ప్రపంచ వేదికపై భారత్ ప్రాతినిధ్యం పెరిగింది. ప్రస్తుతం క్రీడల్లో పూర్తి పారదర్శక వ్యవస్థ అందుబాటులో ఉంది. ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్లకు ‘విశ్వసనీయ ఆతిథ్య దేశంగా’ భారత్​ అభివృద్ధి చెందుతోంది” అని ప్రధాని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత కోచింగ్ బృందం, తదితరులు పాల్గొన్నారు.  

About The Author