ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు (సిఈసి) వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు కు చేపట్టిన పాదయాత్ర, నిరసన ప్రదర్శనలపై గురువారం అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. రాహుల్ ర్యాలీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ స్పందిస్తూ ‘న్యాయవ్యవస్థను ఎవ్వరూ బెదిరించలేరు’ అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తాను సుప్రీంకోర్టు వరకు చేపట్టిన ర్యాలీపై తప్పనిసరిగా వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై నిర్ణయాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసిఐ) పనితీరును ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ, ఇతర ‘ఇండియా’ కూటమి నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్లపై ఎన్నికల సంఘం, సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు ఇచ్చినంత మాత్రాన రాజకీయ నాయకుల ప్రవర్తనను సమర్థించినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘మేము నోటీసులు జారీ చేస్తున్నాం, కానీ తదుపరి విచారణ నాటికి ఆయన (రాహుల్ గాంధీ) ప్రవర్తన ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం’’ అని సీజేఐ సూర్య కాంత్ పేర్కొన్నారు.
నిరసన వ్యవహారాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయవాది గౌరవ్ భాటియాలు కోర్టు దృష్టికి తీసుకురావడంతో ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. “రాజకీయ ర్యాలీలతో ఈ కోర్టును చుట్టుముట్టడం ఆమోదయోగ్యం కాదు. సుప్రీంకోర్టులో జరగకూడనిది జరిగింది’’ అని గౌరవ్ భాటియా గుర్తుచేశారు. ఈ సమయంలో సీజేఐ స్పందిస్తూ ‘న్యాయవ్యవస్థను ఎవ్వరూ బెదిరించలేరు’ అని తేల్చి చెప్పారు. ఈ నిరసనలు, మార్చ్ అనేవి న్యాయస్థానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేనని భాటియా పేర్కొనగా, ఆ ప్రయత్నాలను ‘బలహీనమైనవి’గా సీజేఐ అభివర్ణించారు.
“ఇలాంటి బలహీనమైన ప్రయత్నాలను ఎవరూ పట్టించుకోరు. బయట వాళ్లు రకరకాల ప్రకటనలు చేస్తుంటారు. మేమేమీ అద్దాల మేడల్లో కూర్చోలేదు, బయట ఏం జరుగుతుందో మాకు అన్నీ తెలుసు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే, సుప్రీంకోర్టుకు చేపట్టిన ప్రదర్శన విషయంలో దాఖలైన ప్రత్యేక పిటిషన్‌పై రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లతో పాటు మరికొందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియా కూటమి నిరసన సమయంలో సుప్రీంకోర్టు ప్రాంగణంలో నమోదైన సీసీటీవీ రికార్డింగ్‌లను భద్రపరచాలని కోర్టు ఆదేశించింది.
సోమవారం, అక్టోబర్ 12న సెంట్రల్ ఢిల్లీలోని బారాఖంబా రోడ్ నుంచి రాహుల్ గాంధీ నాయకత్వంలో ‘ఇండియా’ కూటమి మార్చ్ ప్రారంభమై సుప్రీంకోర్టు వరకు సాగింది. ఈ నిరసన వల్ల కోర్టు ప్రాంగణంలో భారీగా జనం గుమిగూడారు. అంతకుముందు, ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల సంఘం పనితీరుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాహుల్ గాంధీ కోరిన అపాయింట్మెంట్ను సీజేఐ సూర్య కాంత్ తిరస్కరించారు.
సదరు అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ సీజేఐ ఆ అభ్యర్థనను తోసిపుచ్చారు. పాలనాపరమైన అంశాల్లో ప్రభుత్వం పనిచేసే తీరులో కోర్టు జోక్యం చేసుకోలేదని, అయితే సరైన ఉపశమనం కోసం న్యాయపరంగా కోర్టును ఆశ్రయించేందుకు నాయకులకు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, సీపీఐకి చెందిన డి. రాజా, జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన మహువా మాజీ, సీపీఎం నేత ఎంఏ బేబీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఇటి మహమ్మద్ బషీర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లో ‘ఇండియా’ కూటమి తన పది ప్రధాన డిమాండ్లను కోర్టు ముందుంచింది. ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించేలా ఆదేశించడం, ఎస్ఐఆర్ నిర్ణయాల రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలించడం, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడం, పిటిషనర్ల ఫిర్యాదులను పరిష్కరించడం, స్వతంత్ర కమిటీతో ఆడిట్ జరిపించడం వంటివి అందులో ఉన్నాయి.
ఇదే సమయంలో జంతర్ మంతర్ అంశంపై కూడా కోర్టు స్పందించింది. జంతర్ మంతర్‌ను నిరసనల ప్రదేశ జాబితా నుంచి ఢిల్లీ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన కోర్టు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించాలనుకున్నారు.
దీంతో ఆ ప్రదేశాన్ని నిరసన ప్రదేశంగా తొలగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీజేపీ తరఫును సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జంతర్ మంతర్‌ను తిరిగి నిరసన ప్రదేశంగా మార్చాలని ఆ పిటిషన్లో కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
More Stories
దేశం వీడాలని బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు
ఇస్లాంలోకి మారినవారికి బీసీ రిజర్వేషన్ అర్హత లేదు.. సుప్రీం స్పష్టం
రైఫిల్ జామ్ కావడంతో అమెరికా గుడిలో తప్పిన కాల్పులు!