బీజేపీలో చేరిన ముగ్గురు సమాజ్‌వాదీ ఎమ్యెల్యేలు!

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు బుధవారం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ముగ్గురు అసమ్మతి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రాకేష్ ప్రతాప్ సింగ్ (గౌరీగంజ్), అభయ్ సింగ్ (గోసాయ్‌గంజ్), వినోద్ చతుర్వేది (కల్పి). రాకేష్ ప్రతాప్ సింగ్ అమేథీలోని గౌరీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి, అభయ్ సింగ్ అయోధ్యలోని గోసాయ్‌గంజ్‌కు, వినోద్ చతుర్వేది జలౌన్‌లోని కల్పి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
 
వీరు 2022 ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులుగా గెలిచినప్పటికీ, 2024 రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. రాకేష్ ప్రతాప్ సింగ్ 2012, 2017, 2022లలో వరుసగా మూడుసార్లు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా గౌరీగంజ్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆయన బిజెపి అభ్యర్థి చంద్ర ప్రకాష్ మిశ్రా మతియారిపై 6,963 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 
 
అయితే, 2024 రాజ్యసభ ఎన్నికల్లో ఆయన ఎస్పీ కి వ్యతిరేకంగా వ్యవహరించి, బిజెపికి ఓటు వేశారు. ‘ఎక్స్’ వేదికగా సింగ్ ఇలా పేర్కొన్నారు: “అక్టోబర్ 14, 2026 నాటి రోజు నా రాజకీయ జీవితంలో అత్యంత కీలకమై,న భావోద్వేగభరితమైన రోజు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడం మాత్రమే కాదు; నా విశ్వాసం, విలువలు, సూత్రాలకు అనుగుణంగా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించే అమూల్యమైన రోజు.” 
 
అయోధ్య జిల్లాలోని గోసాయ్‌గంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అభయ్ సింగ్ కూడా సమాజ్‌వాదీ పార్టీలో ప్రముఖ నాయకుడు. పార్టీ నాయకత్వంతో విభేదాలు, రాజకీయ వ్యాఖ్యల కారణంగా ఆయన పేరు గతంలో వార్తల్లో నిలిచింది. అభయ్ సింగ్ ఎస్పీ తరపున 2012, 2022లలో గోసాయ్‌గంజ్ అసెంబ్లీ స్థానాన్ని రెండుసార్లు గెలుచుకున్నారు. 
 
2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఇంద్ర ప్రతాప్ అలియాస్ ఖబ్బు తివారీ చేతిలో ఆయన ఓడిపోయారు. 2022లో, సింగ్ బీజేపీ అభ్యర్థి ఆర్తీ తివారీని 13,079 ఓట్ల తేడాతో ఓడించారు. జలౌన్ జిల్లాలోని కల్పి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వినోద్ చతుర్వేది  2022లో ఎస్పీ  అభ్యర్థిగా పోటీ చేసి, నిషాద్ పార్టీ అభ్యర్థి ఛోటే సింగ్‌ను 2,816 ఓట్ల తేడాతో ఓడించడం ద్వారా కల్పి అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. 
 
కల్పి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి ముందు, చతుర్వేది ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఉన్న ఒరై  అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2007 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఒరై స్థానం నుండి ఆయన ఎన్నికయ్యారు.

About The Author