1109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌.. పెరిగిన రూ. 4.12 లక్షల కోట్ల సంపద

భారత స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ లాభాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,109 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 358 పాయింట్లు లాభపడింది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లు దూసుకెళ్లడం.. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్‌ ట్యాక్స్‌లపై సమీక్ష జరిగే అవకాశం ఉందనే సంకేతాలు.. మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్ లాభాలబాట పట్టింది.ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.4.12 లక్షల కోట్లు పెరిగింది. మొత్తంగా ఒక శాతంపైగా మార్కెట్ లాభాల్లో ముగిసింది. ప్రస్తుతం మొత్తం మార్కెట్ విలువ రూ.470 లక్షల కోట్లుగా ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,109.10 పాయింట్లు (1.54%) లాభపడి 73,033.78 వద్ద ముగిసింది.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 కూడా 358.60 పాయింట్లు (1.60%) లాభపడి 22,721.95 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ స్వల్పంగా లాభపడింది. అలాగే, నిఫ్టీ మిడ్‌క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా లాభాల్లోనే ముగిసింది.

నిఫ్టీ 50 సెలెక్ట్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, భారత్ ఎలక్ట్రానిక్స్ భారీగా లాభపడ్డాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది. మంగళవారం డాలర్‌తో 82 పైసలు బలపడ్డ రూపాయి 94.96 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఒక శాతంపైగా తగ్గాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 105 డాలర్లుగా ఉంది. బంగారం ఔన్స్ ధర 4,182 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఐటీ షేర్లలో కొనుగోళ్ల జోరుతో మార్కెట్లు దూసుకెళ్లాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ఐటీ రంగంలో ఉత్సాహం నెలకొంది. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 5 శాతం మేర లాభపడింది.  మరోవైపు, సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)ను సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొనడంతో పీఎస్‌యూ బ్యాంకులు, రియల్టీ షేర్లలోనూ కొనుగోళ్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ దేశీయ సూచీలు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి.

About The Author