దీపావళి తర్వాతే యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు  

దేశంలో అతిపెద్ద పండగ సీజన్‌లో వ్యాపారులకు భారీ ఊరట దక్కింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అమలును కేంద్రం వాయిదా వేసింది. అక్టోబర్ 15 నుండి అమలు పరుస్తున్న ట్లు గతంలో ప్రకటించిన కేంద్రం ఇప్పుడు దీపావళి పండుగ తర్వాత నుండి అమలు చేస్తామని ప్రకటించింది.  ఈ మేరకు యూపీఐ అండ్ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించింది.

ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పండుగలు ముగిసిన తర్వాత, అంటే దీపావళి అనంతరం నిర్దేశిత లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపింది. దీపావళి, ధన్‌తేరాస్ సమయంలో భారీ స్థాయిలో కొనుగోళ్లు ఉంటాయి. దీనిలో యూపీఐ లావాదేవీలు అత్యధికంగా ఉంటాయి. ఈ సమయంలో ఎండీఆర్ ఛార్జీలు అమలు చేస్తూ వ్యాపారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. దానితో యూపీఐ పేమెంట్స్ ఎకో సిస్టం దెబ్బతినే అవకాశం ఉంది.                                                                     
కొందరు వ్యాపారులు యూపీఐని వాడకుండా నగదు పేమెంట్స్‌వైపు మొగ్గు చూపొచ్చు. అందుకే, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దీపావళి వరకు ఈ నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది. ఎండీఆర్‌ ఛార్జీలపై ప్రస్తుతం వ్యాపారులు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.  కొత్త అమలు తేదీని ఇంకా వెల్లడించలేదు. దీంతో దీపావళి తర్వాత ఏ సమయంలోనైనా ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.  

కొత్త విధానం ప్రకారం ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేసే యూపీఐ లావాదేవీలపై ఛార్జీ పడదు. అంటే స్నేహితులు, బంధువుల మధ్య చేసే ట్రాన్సాక్షన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే మర్చంట్‌కు (వ్యాపారి) చేసే యూపీఐ ట్రాన్సాక్షన్ విలువ రూ. 2 వేలు దాటితే ఎండీఆర్ ఛార్జీ పడుతుంది. ఇది కస్టమర్ చెల్లించాల్సిన పని లేదు. ఆ వ్యాపారి చెల్లించాలి. రూ. 2 వేలపైన లావాదేవీలపై 0.40 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. 

రూ. 2 వేలు లేదా అంతకంటే తక్కువ విలువైన పేమెంట్స్ సహా మినహాయింపు పొందిన వ్యాపార వర్గాలు ఈ ఛార్జీల పరిధిలోకి రావు.
కేంద్రం నిర్ణయం వల్ల సాధారణంగా చిన్న మొత్తాల్లో యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారులపై ఈ ప్రభావం అంతలా ఉండదు. ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం యూపీఐ ద్వారా జరిగే వ్యాపార చెల్లింపుల్లో ట్రాన్సాక్షన్స్ సంఖ్య పరంగా దాదాపు 95 శాతానికిపైగా ఉచితంగానే కొనసాగనున్నాయి. 

అయితే మొత్తం చెల్లింపుల విలువను చూస్తే పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. రూ. 2 వేల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు మొత్తం పేమెంట్స్ విలువలో గణనీయమైన వాటా కలిగి ఉండటంతో పరిశ్రమ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

 

About The Author