* మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ జేఎన్‌యూలో 11 మంది విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు నిరసనగా
దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ‘స్మాష్ ది పేట్రియార్కీ’, మహిళా సాధికారత అంటూ కల్లబొల్లి నీతులు వల్లించే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం మరోసారి బట్టబయలైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) లో 11 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు తేలడంతో, ఆ పార్టీకి చెందిన ఇన్నర్ మణిపూర్ ఎంపీ డా. అంగోమ్చా బిమోల్ అకోయిజంను అక్టోబర్ 9న జేఎన్‌యూ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిందని గుర్తుచేశారు.దాదాపు నాలుగు నెలల క్రితం బాధితులు ఫిర్యాదు చేసి, ఇంటర్నల్ కమిటీ విచారణలో లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువై జేఎన్‌యూ కఠిన చర్యలు తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ ఎంపీపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ దారుణానికి నిరసనగా డా. మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది మహిళా కార్యకర్తలు, నాయకురాళ్లు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ‘గాంధీభవన్’ను ముట్టడించారు.
బాధిత విద్యార్థినులకు న్యాయం జరిగే వరకు తగ్గేదే లేదని గళమెత్తిన మహిళలను కాంగ్రెస్ అనుకూల పోలీసు యంత్రాంగం దౌర్జన్యంగా అడ్డుకోవడం, అరెస్టులు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. న్యాయం కోరి ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీభవన్‌కు వెళ్తే, అక్రమంగా నిర్బంధించి పోలీసుల చాటున దాక్కోవడం కాంగ్రెస్ పిరికితనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ వీధుల్లో నిరసనల పేరుతో స్వయంగా మహిళా పోలీసులపై చేయి చేసుకునే సంస్కృతి ఉన్న రాహుల్ గాంధీకి మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హతే లేదని శిల్పారెడ్డి మండిపడ్డారు. స్వయానా తమ పార్టీ ఎంపీ అమాయక విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడితే, ఆ ఎంపీపై కేవలం వేటు పడటం సరిపోదని, అతన్ని తక్షణమే పార్లమెంట్ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయనపై తక్షణమే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే కాంగ్రెస్ డీఎన్ఏలోనే స్త్రీ గౌరవానికి తావులేదని, ఇలాంటి వరుస ఘటనలు ఆ పార్టీ అసలు నైజాన్ని నిరూపిస్తున్నాయని హెచ్చరించారు. బాధిత అమ్మాయిలకు న్యాయం జరిగేంత వరకు, కాంగ్రెస్ ఎంపీ కటకటాలపాలయ్యే వరకు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా పోరాటం ఆగదని హెచ్చరించారు.

More Stories
ఎస్ఐఆర్పై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
హైదరాబాద్ నుంచి మూడు హైస్పీడ్ ట్రైన్ మార్గాలపై అధ్యయనం
చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత