ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

తెలంగాణలో ఇటీవల పూర్తయిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో బలంగా తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆల్ సెల్స్ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బోగస్ ఓట్లను తొలగించి పారదర్శకంగా జాబితాను రూపొందిస్తే, వరుస ఎన్నికల ఓటములతో భయపడిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న “ఓట్ చోరీ” నాటకాలను ఎండగడుతూ, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి చేకూరే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో ఒక ఫాల్స్ నెరేటివ్‌ను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తోందని పేర్కొంటూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వీళ్లు సాగిస్తున్న దుష్ప్రచారానికి హద్దు, అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.  కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసిన తర్వాత, బయటకు వచ్చిన రాహుల్ గాంధీ తాము చెప్పిన ఆరోపణలకు రాష్ట్రపతి గారు ఆధారాలు అడిగారని స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు.

తీరా చూస్తే వాళ్ల దగ్గర సమర్పించడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవని ఎద్దేవా చేశారు. చేతిలో ఒక్క ఆధారం కూడా లేకపోయినా, చివరకు దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న గౌరవ రాష్ట్రపతి గారే ఓటు చోరీని ఒప్పుకున్నారంటూ సిగ్గులేకుండా ప్రచారం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఆధారాలు చూపించలేని వీళ్లు, అబద్ధాలను అంటగట్టడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అంటూ విమర్శించారు.


దేశవ్యాప్తంగా మొత్తం 95 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటే, అందులో 82 కోట్ల మంది స్వయంగా తమ ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి ఇచ్చారని ఆయన చెప్పారు. వారందరి పేర్లూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా విజయవంతంగా జాబితాలో నమోదయ్యాయని తెలిపారు. మిగిలిన 13 కోట్ల ఓట్లు ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్  జాబితాలో ఉండటంతో వెంటనే ఖరారు చేయలేదని పేర్కొన్నారు.

ఎవరికైనా ఓటు లేకపోయినా, స్థానచలనం చెందినా తిరిగి నమోదు చేసుకోవడానికి ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకునే స్పష్టమైన అవకాశం కల్పించారని స్పష్టం చేశారు.
ఈ మొత్తం ఎస్‌ఐఆర్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 35 లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్లు స్వయంగా భాగస్వామ్యమయ్యారని ఆయన గుర్తు చేశారు.  ఇంతటి పారదర్శక ప్రక్రియను కూడా, కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓటమి భయంతో కాంగ్రెస్ కావాలని తప్పుడు కథనాలతో ప్రశ్నించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని తెలిపారు.

About The Author