సూప‌ర్‌-డూప‌ర్ ఎల్‌నినోతో ఎరుపెక్కిన ప్ర‌పంచం

గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయికి చేరుకుంటున్నఎల్ నినో ప్రభావంపై ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1950 తర్వాత నమోదుకాబోతున్న అత్యంత బలమైన వాతావరణ పరిణామాలలో ఇది ఒకటి కావచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న వాతావరణ మార్పుల తీవ్రతను ఈ ఎల్ నినో మరింత పెంచుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఓ) వెల్లడించింది. 
 
పసిఫిక్ మహాసముద్రం అంతర్భాగంలో దాగివున్న అధిక ఉష్ణోగ్రతలను బయటకు విడుదల చేయడం వల్ల భూగోళంలో అత్యధిక భాగం అసాధారణమైన వేడిని ఎదుర్కొంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. “ డబ్ల్యుఎంఓ  విడుదల చేసిన బులెటిన్‌తో పాటు జారీ చేసిన ప్రకటనలో, ‘ఎల్ నినో’ ఫిబ్రవరి 2027 వరకు కొనసాగే అవకాశం దాదాపు 100% ఉందని, ఇది కనీసం 1950 తర్వాత అత్యంత తీవ్రమైన వాటిలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని  డబ్ల్యుఎంఓ  సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో పేర్కొన్నారు.”
 
రియాన్ మౌ అనే అంతర్జాతీయ వాతావరణ నిపుణుడు మొత్తం భూగోళానికి సంబంధించిన క్లైమేట్ మ్యాప్‌ను సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకుంటూ భూగోళం అంతా దాదాపుగా ఎరుపు రంగులోకి (తీవ్రమైన వేడికి సూచికగా) మారిపోయిందని పేర్కొన్నారు.
 
ఎల్ నినో దృగ్విషయానికి కేంద్ర బిందువైన మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రికార్డు స్థాయిలో 3.7 డిగ్రీల సెల్సియస్ (6.7 డిగ్రీల ఫారెన్‌హీట్) అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ తెలిపింది. నవంబర్ 2015 నుండి జనవరి 2016 వరకు నమోదైన 2.6 డిగ్రీల సెల్సియస్ మునుపటి రికార్డు కంటే ఈ అంచనా ఉష్ణోగ్రత వ్యత్యాసం గణనీయంగా ఎక్కువ అని అది పేర్కొంది.
 
మరో శాస్త్రవేత్త జీకే హాస్‌ఫాథర్ ‘‘ఈ ఏడాది ఎల్ నినో రికార్డులను తిరగరాస్తూ కొత్త గరిష్టాలకు చేరుకుంటోంది. నినో 3.4 ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ఇది ఇప్పటివరకు నమోదైన ఏ ఇతర ఎల్ నినో పరిణామం కంటే కూడా అత్యధికం’’ అని పేర్కొన్నారు. లియోన్ సిమన్స్ అనే మరో నిపుణుడు ఈ పరిణామాన్ని ‘సూపర్-డూపర్ ఎల్ నినో’ గా అభివర్ణించారు.
 
యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ పరిశోధకులు గత నెలలో వెలువరించిన వివరాల ప్రకారం ఈ ఏడాది వచ్చిన ఈ ‘సూపర్-ఎల్ నినో’ కారణంగా జూన్ నుంచి ఫిబ్రవరి 2027 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4,51,000 మందికి పైగా మరణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

About The Author