వైద్యులు, దవాఖానలు ఇకపై రోగులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాను ఇష్టానుసారంగా వాడుకోలేరు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) ఎథిక్స్, మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డ్ జారీచేసిన కొత్త నిబంధనల ప్రకారం ఇన్‌స్టాగ్రామ్, ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్, స్పాన్సర్డ్ పోస్టులు, ఏఐ సృష్టించిన ప్రచారాలను కూడా వైద్య ప్రకటనల పరిధిలోకి తీసుకువచ్చాయి. దవాఖానలు/వైద్య సంస్థలు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్లు పాటించవలసిన నైతిక ప్రకటనలు, ప్రజా సమాచార ప్రసారంపై ఎన్‌ఎంసీ ఈనెల 6న జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
దానితో భారతదేశంలోని వైద్యులు, ఆసుపత్రులు ఇకపై తమను తాము “ఉత్తమమైనవారు”, “నెం.1” లేదా “100% విజయవంతమైనవారు” అని ప్రచారం చేసుకోలేరు. తప్పుదోవ పట్టించే వాదనల నుండి రోగులను రక్షించడం, ఆరోగ్య సమాచార ప్రసారాన్ని వాస్తవికంగా, నైతికంగా ఉంచడం దీని లక్ష్యాలలో ఉన్నాయి. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులకు, రాష్ట్ర వైద్య మండళ్లకు, వైద్య విద్యా సంచాలకులకు, ప్రతి వైద్య కళాశాల డీన్ లేదా ప్రిన్సిపాల్‌కు ప్రతులు పంపారు. నిషేధించిన పద్ధతుల జాబితా చాలా పెద్దది. నిర్దిష్టమైనది.
రిజిస్టర్డ్ వైద్యుడు “గ్యారెంటీడ్ క్యూర్స్”, “బెస్ట్ డాక్టర్స్”, “నెం.1 స్పెషలిస్ట్”, “100% సక్సెస్”, “పెయిన్‌లెస్ ట్రీట్‌మెంట్”, “మిరాకిల్ ట్రీట్‌మెంట్” లేదా “ఎక్స్‌క్లూజివ్ క్యూర్” వంటి పదబంధాలను ఉపయోగించకూడదు. వైద్యులు ఒక ఔషధాన్ని, పరికరాన్ని లేదా వాణిజ్య ఉత్పత్తిని ఆమోదించకూడదు, లేదా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనకూడదు, దానికి వారికి డబ్బు చెల్లించినా చెల్లించకపోయినా సరే. రోగి సమ్మతితో, కేవలం శాస్త్రీయ లేదా విద్యా ప్రయోజనాల కోసం ప్రచురించిన సందర్భాలు మినహా, చికిత్సకు ముందు-తర్వాత ఫోటోలు, ప్రముఖ రోగుల గురించిన ప్రచారం, ప్రచార కేసు ఫలితాలు నిషేధించారు.
డిస్కౌంట్లు, పరిమిత-కాల ఆఫర్లు, కూపన్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఉచిత చికిత్సలు, రెఫరల్ ప్రయోజనాలు అనుమతించబడవు. రోగులతో ముడిపడి ఉన్న కమీషన్లు, రెఫరల్ ఫీజులు, లీడ్-జనరేషన్ ఫీజులు నిషేధించారు, అలాగే నకిలీ ఫాలోవర్లు, లైక్‌లు లేదా రివ్యూలను కొనడం లేదా ఏర్పాటు చేయడం కూడా నిషేధించారు. “ఉత్తమమైన”, “ప్రముఖ”, “అత్యంత విశ్వసనీయమైన” లేదా “అగ్రస్థానంలో ఉన్న” వంటి తులనాత్మక వాదనలు పారదర్శకమైన, స్వతంత్రమైన పద్ధతి ద్వారా నిష్పక్షపాతంగా ధృవీకరించగలిగితేనే అనుమతిస్తారు.
ప్రచారంలో ఉపయోగించే ఏదైనా అవార్డు లేదా ర్యాంకింగ్ స్వతంత్రంగా ధృవీకరించదగినదిగా ఉండాలి. అవసరమైన చోట అవార్డును ప్రదానం చేసిన సంస్థ, తేదీని వెల్లడించాలి.
వైద్యులు కేవలం ఆరోగ్య అవగాహన కోసమే కాకుండా, తమ వ్యక్తిగత బ్రాండ్‌లను నిర్మించుకోవడానికి, రోగులను ఆకర్షించడానికి కూడా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఇతర వేదికలను ఎక్కువగా ఉపయోగిస్తున్న తరుణంలో ఎన్‌ఎంసీ ఈ చర్య తీసుకుంది. ప్రజారోగ్య సమాచారానికి, వాణిజ్య ప్రచారానికి మధ్య ఎన్‌ఎంసీ ఇప్పుడు మరింత స్పష్టమైన గీతను గీసింది.

More Stories
‘రామాయణం’ షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం
మహిళలపై నేరాలకు పాల్పడే దుండగుల గుండెల్లో వణుకు పుట్టాలి
యుపిలో ఏ వంట నూనె వాడారో హోటళ్లు చెప్పాల్సిందే