* కొత్తతరహా ఉగ్రవాద ముప్పుపై ఇజ్రాయెల్ రాయబారి హెచ్చరిక
భారత్, తమ దేశానికి కొత్తతరహా ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని, ప్రభుత్వాలు, భద్రతా సంస్థల కంటే వేగంగా ఉగ్రవాదులు తమ సామర్థ్యాలను పెంచుకుంటున్నారని న్యూఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ హెచ్చరించారు. ఫ్లైదుబాయ్ ఘటన నేపథ్యంలో ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్ పొరుగున ఉగ్రవాద సంస్థలకు హమాస్ ఎలా ప్రేరణగా మారుతుందో వివరించారు.
మనకంటే వేగంగా ఉగ్రవాదులు పనిచేస్తున్నారని, వారిని నియంత్రించాలంటే మనం మరింత వేగంగా స్పందించాలని ఆయన పేర్కొన్నారు. ‘‘ఉగ్రవాదులు మనకంటే వేగంగా పనిచేస్తున్నారు. వారిని అధిగమించాలంటే మరింత వేగంగా మనం స్పందించాలి. తదుపరి ఉగ్రదాడి వేవ్ కంటే ముందుండాలంటే మనం చాలా జాగ్రత్తగా, వేగంగా వ్యవహరించాలి. మరో తీవ్రవాద దాడి ఖచ్చితంగా వస్తుంది’’ అని అజార్ ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడికి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ దేశ రాయబారి రువెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాద సంస్థలు పరస్పరం సహకరించుకుంటున్నాయా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస పశ్చిమాసియాను దాటి హమాస్ విస్తరిస్తున్న తీరును గుర్తుచేశారు. గతేడాది కాలంగా పలువురు హమాస్ అగ్రశ్రేణి కమాండర్లు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో పర్యటించినట్టు నివేదికలు వచ్చాయి. నాజీ జహీర్, ఖలీద్ అల్ కదుమీ వంటి హమాస్ నేతలు జైషే మహమ్మద్, లష్కరే తొయిబా ఉగ్రవాద సమూహాలు నిర్వహించిన కార్యక్రమాలలోనూ పాల్గొన్నారు.
లష్కరే కేడర్‌కు ఆపరేషన్ పద్దతుల్లో హమాస్ శిక్షణ ఇస్తున్నట్టు ఇటీవల నిఘా నివేదిక వెల్లడించింది. ఈ ప్రభావానికి ఉదాహరణగా గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని రువెన్ ప్రస్తావించారు. ‘‘ఈ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థలకు హమాస్ ప్రేరణగా నిలిచింది. పహల్గామ్ దాడి దాని ప్రతిరూపమే. హమాస్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెరవెనుక ఏం జరుగుతుందో మనకు తెలియదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే వాస్తవమని, ఈ ముప్పును ఎదుర్కొని, అధిగమించేందుకు ప్రజాస్వామ్య దేశాలు తమ సామర్థ్యాలను పెంచుకోవాలని అజార్ పిలుపునిచ్చారు. ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్‌పై దాడిచేసిన కో-పైలట్ దానిని కూల్చివేయడానికి ప్రయత్నించాడనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఇజ్రాయెల్ రాయబారి ఈ హెచ్చరికలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కో-పైలట్ ఒంటరిగా చేసిన దాడి కాదా? అనేది ఇంకా తేలలేదన్న అజార్ కానీ, దీనిని తక్షణ ముప్పుగా ఆయన అభవర్ణించారు. ‘‘తాము ఇంకా ఓడిపోలేదని నిరూపించుకోడానికి ఉగ్రవాదులు, అలాగే ఇరాన్ పాలకులు ఎటువంటి అకాశాన్నైనా వాడుకోడానికి ప్రయత్నిస్తారు’’ అని పేర్కొన్నారు.

More Stories
విలక్షణ నటుడు, దర్శకుడు నానా పటేకర్ కన్నుమూత
భారతీయ సంప్రదాయాలతోనే సమాజ భద్రత, సంక్షేమం
యువ గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ మహేష్ కాక్ డేకు రామానుజన్ ప్రైజ్