భారత సేవా సంప్రదాయానికి అద్దం ఆర్ఎస్ఎస్ శతాబ్దపు సేవా ప్రస్థానం

భారత సేవా సంప్రదాయానికి అద్దం ఆర్ఎస్ఎస్ శతాబ్దపు సేవా ప్రస్థానం
తెలంగాణ మాజీ గవర్నర్, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రచించిన “సేవా శతాబ్దం – 100 సేవా కార్యక్రమాలలో ఆర్ఎస్ఎస్” అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరిస్తూ ఆర్ఎస్ఎస్ శతాబ్ద కాలపు సేవలు, సామాజిక బాధ్యత, దేశ నిర్మాణంలో దాని కృషిని ఈ పుస్తకం నమోదు చేసిందని పేర్కొన్నారు. 
 
“నేటి వార్తలే రేపటి చరిత్ర” అని పేర్కొన్న రాధాకృష్ణన్, మంచి పనులను నమోదు చేయాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. లేకపోతే అవి ప్రజల జ్ఞాపకాల నుండి చెరిగిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. సేవా భావం ఏ విధంగా నిరంతర సామాజిక సేవగా రూపాంతరం చెందిందో ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. 
 
“సేవయే ధర్మం; అది ఒక బాధ్యత” అనే ప్రాథమిక ఆదర్శాన్ని ప్రస్తావిస్తూ, ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు పేదలు, అట్టడుగు వర్గాలు,  కార్మికులు, మహిళలు, పిల్లలతో సహా సమాజంలోని వివిధ వర్గాలకు చేరాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఆహారం, మందులు, అత్యవసర సహాయాన్ని అందించడంలో ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద కార్యకర్తలు పోషించిన పాత్రను ఆయన గుర్తుచేసుకున్నారు.
 
పుస్తకంలోని “వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణం” అనే అంశాన్ని ప్రస్తావిస్తూ, దేశ నిర్మాణానికి దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత,  జాతీయ సమైక్యత అత్యవసరమని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. ఈ పుస్తకం కేవలం ఆర్ఎస్ఎస్ శతాబ్ద కాలపు సేవా రికార్డుగానే కాకుండా, భారతదేశ సేవా సంప్రదాయం, సంస్కృతి, జాతీయ చైతన్యాన్ని భావి తరాలకు తెలియజేసే పత్రంగా కూడా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. 
 
డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, ఈ పుస్తక ప్రచురణలో భాగస్వాములైన వారందరికీ ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. చరిత్రను నమోదు చేసే ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార & ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, పుదుచ్చేరి హోం మంత్రి ఎ. నమశ్శివాయం, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.

కాగా, తమిళిసై సౌందరరాజన్ ఈ పుస్తకాన్ని విడుదల చేసినందుకు ఉపరాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. “ఇది ఒక గొప్ప రోజు . నిజంగా చిరస్మరణీయమైన సందర్భం! శతాబ్ద కాలంగా సేవ, త్యాగం, దేశ నిర్మాణం కోసం కృషి చేసిన ఆర్‌ఎస్‌ఎస్ వంటి గొప్ప సంస్థకు అంకితమైన ఈ పుస్తకాన్ని విడుదల చేయడం గౌరవంగా ఉంది. ఈ పుస్తకం కేవలం పదాల సమాహారం కాదు—భారత్ పట్ల దాని సేవ, నిబద్ధత అసంఖ్యాకమైన జీవితాలకు స్ఫూర్తినిచ్చిన ఒక సంస్థకు ఇది హృదయపూర్వక నివాళి. ఇది కృతజ్ఞత, గర్వం, మధురమైన జ్ఞాపకాలతో నిండిన రోజు,” అని ఆమె `ఎక్స్’లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.