ఉత్తర అరేబియా సముద్రంలో మంగళవారం సాయంత్రం అనూహ్య భద్రతా పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ జలాల్లో సాధారణ నిఘా గస్తీ నిర్వహణా విధుల్లో ఉన్న భారత నావికాదళానికి చెందిన ఒక యుద్ధనౌకను పాకిస్థాన్ నావికాదళానికి చెందిన నౌక అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. పాకిస్థాన్ ఓడ అత్యంత ప్రమాదకర రీతిలో, నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఊహించని ఘర్షణ పరిణామంతో అరేబియా తీర ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకుంది. అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం భారత నావికాదళ యుద్ధనౌక అంతర్జాతీయ జల సరిహద్దుల్లో తన నిత్యకృత్యాల ప్రకారం నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే ఆ సమయంలో అక్కడికి చేరుకున్న పాకిస్థాన్ నేవీ ఓడ, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే అతివేగంగా భారత యుద్దనౌక వైపు దూసుకొచ్చింది.
అంతేకాకుండా సముద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా నౌకను తిప్పడంతో రెండు నౌకలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి లేదా నౌకల నష్టం వాటిల్లలేదని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. సముద్ర నిబంధనలను బొత్తిగా ఖాతరు చేయకుండా పాకిస్థాన్ నౌక ప్రవర్తించిన తీరుపై భారతదేశం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రమాదకర ఘటన చోటుచేసుకున్న మరుసటి రోజు అంటే బుధవారం నాడు న్యూఢిల్లీలోని పాకిస్థాన్ అత్యున్నత దౌత్య ప్రతినిధికి భారత విదేశాంగ శాఖ అత్యవసర సమన్లు జారీ చేసింది.
దౌత్య మార్గాల ద్వారా ఈ అంశాన్ని తీవ్రంగా లేవనెత్తిన భారత్ పాకిస్థాన్ నావికాదళం వ్యవహరించిన అజాగ్రత్త, ప్రమాదకర తీరుపై తన నిరసనను వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో గస్తీ తిరిగే నౌకల భద్రతకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. 1991 నాటి నౌకావిన్యాసాల అగ్రిమెంట్‌లోని ఆర్టికల్ 10 ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకనలో తెలిపింది.
పాకిస్థానీ విదేశాంగ శాఖకు ఈ విషయాన్ని చేరవేసినట్లు భారత్ తెలిపింది. పాక్ మిలిటరీ యూనిట్లు అన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన చేసినట్లు చెప్పారు. పాకిస్థాన్ విదేశాగ శాఖ ముందు నిరసన వ్యక్తం చేయాలని ఇస్లామాబాద్‌లోని భారత ఎంబసీకి చెప్పినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొన్నది. అంతర్జాతీయ జలాల్లో పాకిస్తాన్ నావికా దళాల ‘ఆమోదయోగ్యం కాని, వృత్తివిరుద్ధమైన ప్రవర్తన’ కారణంగా జరిగిన ఢీకొనడంపై తీవ్ర నిరసన తెలియజేయడానికి పాకిస్తాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరిచ్‌ను పిలిపించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
“ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి, అన్ని సైనిక విభాగాలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇరుపక్షాల మధ్య ఉన్న సంబంధిత ఒప్పందాల నిబంధనలను గౌరవించాలని సంబంధిత పాకిస్తాన్ అధికారులకు తెలియజేయాలని పాకిస్తాన్ ఛార్జ్ డి అఫైర్స్‌కు సలహా ఇవ్వబడింది,” అని అది పేర్కొంది.

More Stories
చరిత్రలో మొదటిసారి భద్రతా హెచ్చరికల మధ్య మక్కా
పెల్లెట్ గన్ వాడకంపై దర్యాప్తు కమిటీ మార్పుకు సుప్రీం నిరాకరణ
భారత సేవా సంప్రదాయానికి అద్దం ఆర్ఎస్ఎస్ శతాబ్దపు సేవా ప్రస్థానం