* విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టి.. బారికేడ్ల వెనుక దాక్కుంటారా?
తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు, ప్రశ్నిస్తే నిర్బంధాలు, నిరసన తెలిపితే లాఠీలతో సమాధానం చెబుతోందని పేర్కొంటూ ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన? ఇదేనా రాహుల్ గాంధీ పదేపదే మాట్లాడే ప్రజాస్వామ్యం? అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన రూ.15 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, వివాదాస్పద 22-ఏ జాబితాలో చేర్చిన అమాయక ప్రజల ప్రైవేటు భూములకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వైపు శాంతియుతంగా వెళ్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
విద్యార్థుల గొంతుకగా నిలబడేందుకు బీజేపీ తరపున ఉద్యమబాట పట్టిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుని అసెంబ్లీ వద్ద బలవంతంగా లాక్కెళ్లి అక్రమంగా అరెస్టు చేయడం దారుణం అని విమర్శించారు. పార్టీ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరుగుతున్న అసహనానికి, అభద్రతకు నిదర్శనం అని ధ్వజమెత్తారు.
సభ లోపల బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అడ్డుకోవడం, సభ బయట ప్రజల తరఫున గొంతెత్తుతున్న బీజేపీ నాయకులను పోలీసులతో అరెస్టు చేయించడం ప్రజాస్వామ్య పాలన కాదని, పక్కా నియంతృత్వం అని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలకు సమాధానం చెప్పలేక బారికేడ్ల వెనుక దాక్కుంటారా? ఎన్నికల హామీలు అమలు చేయలేక పోలీసుల వెనుక దాక్కుంటారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
అధికారంలోకి రావడానికి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేశారని, ఇప్పుడు అదే హామీల గురించి అడిగితే సమాధానం చెప్పకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులతో ప్రజాసంక్షేమానికి సంబంధించిన ప్రశ్నలను ఆపలేరని, బారికేడ్లతో ప్రజల ఆవేదనను అడ్డుకోలేరని, అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరని, లాఠీలతో విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.అదే సమయంలో రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 22-ఏ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, బాధితులకు న్యాయం చేయాల్సందే అని స్పష్టం చేశారు.

More Stories
బిఆర్ఎస్ ఎమ్యెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి అరెస్ట్
తెలంగాణాలో ఎస్ఐఆర్ గడువు అక్టోబరు 7 వరకు పొడిగింపు
అసెంబ్లీలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు