భూభాగాల వాస్తవ పరిమాణాలను కచ్చితంగా ప్రతిబింబించేలా సమాన విస్తీర్ణ ప్రపంచ పటాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి మద్దతు తెలిపిన భారత్ సరికొత్త ప్రపంచ పటంలో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని స్పష్టం చేసింది. దేశ భూభాగాన్ని తప్పుగా లేదా తప్పుదోవ పట్టించేలా చిత్రీకరిస్తే దాన్ని అంగీకరించబోమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
‘‘ఈ తీర్మానం ఏ నిర్దిష్ట ప్రపంచ పటాన్ని స్వీకరించదు లేదా ధ్రువీకరించదు. అలాగే అంతర్జాతీయ సరిహద్దులు, వివాదాస్పద ప్రాంతాలు లేదా ప్రాంతాల పేర్లతో సహా రాజకీయ మ్యాప్‌ల విధానాన్ని ఇది ప్రస్తావించదు’’ విదేశాంగ శాఖ తెలిపింది. “భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై దేశ వైఖరి స్పష్టమైనది, స్థిరమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది కాదు” అని స్పష్టం చేసింది.
“ఖండాల భూభాగాలను వాటి సాపేక్ష పరిమాణాలకు అనుగుణంగా చూపించే ఈక్వల్-ఏరియా మ్యాప్ ప్రొజెక్షన్లను ప్రోత్సహించాలన్న ప్రాథమిక సూత్రానికే మద్దతు ఇచ్చాం. అంతేకానీ ఏదైనా ఒక నిర్దిష్ట ప్రపంచ పటం, ప్రొజెక్షన్ లేదా దేశాల సరిహద్దుల చిత్రణను ఆమోదించినట్లు కాదు. ఈ తీర్మానం ఏదైనా నిర్దిష్ట ప్రపంచ పటాన్ని అధికారికంగా స్వీకరించడం లేదా దానికి ధ్రువీకరణ ఇవ్వడం లేదు. అంతర్జాతీయ సరిహద్దులు, వివాదాస్పద ప్రాంతాలు, ప్రాంతాల పేర్లు వంటి రాజకీయ కార్టోగ్రఫీ అంశాలను కూడా ఇది పరిష్కరించదు’ అని రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఖండాల భూభాగాల పరిమాణ నిష్పత్తిని సరిగ్గా చూపే సమాన విస్తీర్ణ పటాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ‘కరెక్ట్ ది మ్యాప్: రీబ్యాలెన్సింగ్ గ్లోబల్ కార్టోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ అండ్ ప్రమోటింగ్ ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది వరల్డ్స్ రీజియన్స్, పార్టిక్యులర్లీ ఆఫ్రికా’’ అనే పేరిట తెచ్చిన ఈ తీర్మానాన్ని సెప్టెంబర్ 4న ఐరాస సర్వసభ్య సమావేశం 164-1 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది.

More Stories
పర్వతారోహకులతో కరిగిపోతున్న హిమాలయాలు
నవంబర్ 27 బాల్య వివాహ వ్యతిరేక దినంగా ప్రకటించిన ఐరాస
బెంగాల్లో 1000 విద్య భారతి పాఠశాలల ఏర్పాటు