కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ‘సర్’ పక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 13.37 కోట్ల ఓట్లను తొలగించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నిచోట్లా కలిపి 13 కోట్ల మంది పేర్లను ఓటర్ జాబితానుంచి ఈసీఐ తొలగించింది. ఇది మొత్తం 14.1 శాతం ఓట్లకు సమానం. మొదట బిహార్‌లో ప్రారంభమైన సర్ ప్రక్రియ ఇప్పటివరకు మూడు దశల్లో కొనసాగింది.
గత ఏడాది జూన్‌లో బీహార్‌తో ఈసీ ఎస్ఐఆర్ ను ప్రాపక్రియరంభించింది. తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకొని రెండవ దశను 2025 అక్టోబర్‌లో ప్రకటించారు. మూడవ దశలో, ఈసీ దేశంలోని మిగిలిన ప్రాంతాలను కవర్ చేసింది. అయితే, కొనసాగుతున్న జనగణన పనులు, వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లలో ఎస్ఐఆర్ ను తరువాత తేదీలో నిర్వహిస్తామని, అలాగే అస్సాంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ పౌర పట్టిక ప్రచురించే వరకు ఎస్ఐఆర్ నిర్వహించబోమని ప్రకటించింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 2.07 కోట్ల ఓట్లను తొలగించింది. ఆ తర్వాత కర్ణాటకలో 1.08 కోట్ల ఓట్లు తొలగిపోయాయి. ఆ తర్వాత ఎక్కువ ఓట్లు తొలగిపోయిన మూడో రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ఏకంగా 73.39 లక్షల ఓట్లు తొలగిపోయాయి. ఓటర్ల శాతం పరంగా చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 32.8 శాతం ఓట్లు తొలగిపోయాయి. ఢిల్లీలో 47.57 లక్షల ఓట్లు, తర్వాత ఏపీలో 44.90 లక్షల ఓట్లు తొలగిపోయాయి.
అయితే, ఇది తుది జాబితా కాదు. ముసాయిదా మాత్రమే. ప్రస్తుతం ఈ జాబితాలో ఓట్లు గల్లంతైన వారు తగిన డాక్యమెంట్లతో సంబంధిత అధికారులను సంప్రదించాలి. వాటిని పరిశీలించిన అనంతరం అర్హులైన వారి పేరును ఓటర్ల జాబితాలో చేరుస్తారు. అలా, పేర్లు గల్లంతైన వారు తమ అభ్యంతరాలు తెలుపుతూ సమీక్ష కోరే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తైన తర్వాత దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి ఓటర్ల జాబితా వెలువడుతుంది.
ఓటరు జాబితాలో మీ పేరు ఉందో, లేదో తెలుసుకోవాలనుకుంటే voters.eci.gov.in ను సంప్రదించాలి. లేదా వోటర్ హెల్ప్‌లైన్ యాప్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. పూర్తిగా జాబితా నుంచి పేరు గల్లంతైతే ఫాం 6, జాబితాలో పేరు ఉంచడానికి లేదా తొలగించడానికి తగిన అభ్యంతరాలపై ఫాం 7, జాబితాలో పేరుండి వివరాలు తప్పుగా ఉంటే ఫాం 8 దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. అవసరమైతే బూత్ లెవల్ ఆఫీసర్‌ను కూడా సంప్రదించవచ్చు.

More Stories
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంలో భిన్నాభిప్రాయం
కావేరి నదీ జలాల వివాదంలో థర్డ్ పార్టీలు జోక్యం చేసుకోలేవు
జైష్ ఉగ్రవాది గాలింపు కోసం కాశ్మీర్‌లోని 5 జిల్లాల్లో హై అలర్ట్